కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ఊరట

  • హైకోర్టు అనర్హత తీర్పుపై సుప్రీం స్టే
  • ప్రతివాదులకు నోటీసులు పంపించిన కోర్టు
  • కేసు నాలుగువారాలకు వాయిదా

న్యూ దిల్లీ,ఆగస్ట్7 (ఆర్‌ఎన్‌ఎ):  ‌కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వర రావు కేసు విచారణను జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా ధర్మాసనం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్‌ ‌చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావు పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పు కాపీని జులై 26న అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జలగం అందజేశారు. తీర్పుపై స్టే కోరుతూ తొలుత వనమా హైకోర్టునే ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2018 ఎన్నికల అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు  తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు 2019లో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై మూడేండ్లుగా వాదనలు జరిగాయి. జులై 25న  కోర్టు తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై అనర్హత వేటు వేయడంతోపాటు 5 లక్షల జరిమానా విధించింది. తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించడంతో వనమా మాజీ ఎమ్మెల్యే అయినట్లుగానే భావించారు. అయితే ..ఈ వివాదంలో ప్రభుత్వం తీర్పును వెంటనే అమలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేలగా గుర్తించాలని.. ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులను , బీఆర్‌ఎస్‌ ‌పెద్దలను కలిశారు.  కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని మంగళవారం  హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేశారు. స్పీకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. అయితే ఆయననుకలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

చివరికి  వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు ఇద్దరూ బీఆర్‌ఎస్‌కు చెందిన వారే కావడంతో ఈ  అంశంపై నిర్ణయం తీసుకోవడంలో  బీఆర్‌ఎస్‌ ‌నేతలకు ఇబ్బందికరంగా మారింది. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ ‌తరపున గెలిచినప్పటికీ బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. అప్పట్నుంచి అక్కడ జలగం వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గింది. దీనిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీఈ తీర్పు వచ్చిన తర్వతా తాను పార్టీకి విధేయుడినేనని చెబుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసి ఉన్నట్లయితే.. వనమా మాజీ అయ్యేవారు. జలగం వెంకట్రావు మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారు. అయితే వివాదం కారణంగా ఇద్దరూ హాజరు కాలేదు. ఇంతా చేసి ఎమ్మెల్యే పదవి కాలం మూడు నెలలే ఉంది. పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ‌ప్రకారం పాల్వంచలోని సర్వే నంబర్‌ 122/2/‌సంస్తాన్‌ 1 ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్లు వెల్లడించారు.

సదరు భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపితమైంది. ఆయన భార్య పేరు ద పాల్వంచలో సర్వే నంబర్‌ 992‌లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొంది. తప్పుడు వివరాలు వెల్లడించడంతోపాటు ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు ఆధారాలతో సహా వెల్లడి కావడంతో వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది. 2018 డిసెంబర్‌ 12 ‌నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణిం చాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ ‌దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *