- ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
- సెక్షన్ 151ను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం…అరెస్ట్‌లను ఖండిస్తున్నాం
- టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: కొండగట్టు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు కెసిఆర్ ఎందుకు వెళ్లడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టు పర్యటన-అక్రమ అరెస్టుల సందర్భంగా బుధవారం కోదండరామ్ స్పందిస్తూ…అక్రమ నిర్బంధాలపై మండిపడుతూ ఒక ప్రకటన జారీచేశారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో అనేక మంది దుర్మరణం చెంది, వందల కుటుంబాలు చిన్నాభిన్నం అయితే ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఇప్పటికైనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను అందరినీ కెసిఆర్ పరామర్శించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డిలతో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను కోదండరామ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రి వర్గంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళితే ఆ జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులను సెక్షన్ 151 కింద అరెస్టు చేస్తున్నారని అన్నారు.
తీవ్రమైన నేరం జరిగే అవకాశం ఉండి, అరెస్టు చేయక పోతే ఆ ప్రమాదాన్ని ఆపలేని పరిస్థితి తలెత్తుతుందని తేలితే తప్ప సెక్షన్ 151ని వాడరాదని కోదండరామ్ స్పష్టం చేశారు. సెక్షన్ స్వభావాన్ని మరిచి, ప్రభుత్వం దాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైన విచ్చల విడిగా ప్రయోగిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సెక్షన్ 151 దుర్వినియోగాన్ని ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన తెలంగాణ జన సమితి నాయకులను, ఇతర ప్రతిపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి అరెస్టులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం అవుతామని కోదండరామ్ కెసిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




