- రైతులు బాగు పడేవారా..?
- జై కిసాన్..జై జవాన్..మాటలు చెప్పిన వారి హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయి
- బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై• మంత్రి హరీష్‌రావు ఫైర్
- నర్మెట్టలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన మామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : 50ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావులు, నెర్రలు బారిన నేలలు తప్ప చేసిందేమీలేదనీ, కేసీఆర్ హయాంలో గత తొమ్మిదేండ్లలో కరువనేదే లేదనీ, కరెంట్ కోతలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు..శనివారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారులో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రైతులకు 24 గంటలు అవసరం లేదు, మూడు గంటలే కరెంటు సాలు అంటున్నారు కాంగ్రెసోళ్లనీ, వాళ్లవి తెలివి ఉన్న మటాలా? తెలివి లేని మాటాలా?అని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. జై కిసాన్…జై జవాన్ అని మాటలు చెప్పిన వారి హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయనీ బిజెపిపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ లేకుంటే, తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వొస్తుండేనా, రైతులు బాగు పడేవారా..?అని ప్రశ్నించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు, అంతర పంటలు సాగు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలనీ, ఆయిల్ పామ్ మొక్కల కొమ్మలు దగ్గరగా కట్టొద్దనీ, అవి ఎంత విస్తారంగా పెరిగితే అంత దిగుబడి పెరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి రైతులతో శిక్షణ కార్యక్రమాలు రైతుల తోటల్లో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు మండలాల వారీగా మీటింగ్‌కు ఏర్పాటు చేసి రైతుల్లో అవగాహన నిర్వహించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతులను మరింత చైతన్యపరిచే లక్ష్యాన్ని పెట్టుకుందనీ, ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ వారి ఆధ్వర్యంలో సాగుకు సంబంధించి ఒక డైరీ ప్రతి రైతుకు అందిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రైతులు ఆర్థికంగా బాగుపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమనీ, వడగళ్లు, చీడపీడలతో వరి ఇతర పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారునీ, పామ్ ఆయిల్ సాగుతో ఆ సమస్య ఉండదన్నారు.
దేశాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశం నష్టపోతుందనీ, ప్రతి ఏటా లక్ష 56 వేల కోట్ల విలువైన నూనెను దిగుమతి చేసుకుంటున్నామనీ, 40 శాతం మాత్రమే మన దేశంలో నూనె గింజలు పండిస్తే, 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. మలేషియా, రష్యా, బ్రెజిల్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామనీ, దేశాన్ని పాలించిన పాలకులకు దూరదృష్టి లేక ఈ దుస్థితి వొచ్చిందన్నారు. మన దేశానికి ఆయిల్ కొరత తీరాలంటే ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ సాగు జరగాలనీ, 20లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, పామ్ ఆయిల్ సాగుతో గ్రీన్ రెవల్యూషన్ సాధ్యమవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతన్నకు అభయ హస్తం అని, తెలంగాణ వొస్తే ఏం వొచ్చిందని కొందరు అంటున్నారనీ తెలంగాణ రాకపోతే కాళేశ్వరం వొచ్చేదా? రైతులు బాగుపడేవారా? అని ప్రశ్నించారు. ఆయిల్ పామ్ సాగుబడి ప్రభుత్వ ఉద్యోగంలాగా నెలనెలా ఆదాయం వొస్తుందనీ, రైతుకు లాభసాటిగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచన చేశారన్నారు.
నర్మెట్టలో నిర్మించనున్న కర్మాగారంలో గంటకు 120 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ను ప్రాసెస్సింగ్ చేసే కెపాసిటీతో లేట్ అయినా లేటెస్ట్‌గా నిర్మించుకోబోతున్నాంమనీ, ఆయిల్ పామ్‌తో ప్రాసెస్సింగ్ చేసినంక మిగిలిన పొట్టుని కోళ్లకు, పశువులకు దాణాగా తయారు చేసే కర్మాగారం కూడా అంతర్భాగంగా నిర్మించబోతున్నామనీ, మిగిలిన పిప్పితో కరెంటు తయారు చేసే కేంద్రాన్ని కూడా నిర్మించబోతున్నామన్నారు. రీసైకిల్ చేసే వ్యవస్థతో జీరో వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రీసైకిల్ చేసుకొని ప్రతి చుక్కను తిరిగి ఉపయోగించుకునే విధంగా టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నామనీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హర్టికల్చర్ కమిషనర్ ఎం.హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నేతలు వంగ నాగిరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, కూర మాణిక్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణశర్మ, తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డితో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.




