- చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకు లేదు
- మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుంది
- ఆ పని మీకే అప్పచెబుతా…నింపి చూపండి
- అసెంబ్లీలో కెసిఆర్, బిఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫ్రిబ్రవరి 14 : ముఖ్యమంత్రిని ఏం పీకడానికి వెళ్లారని మాజీ సిఎం కెసిఆర్ అనడంపై అసెంబ్లీ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం నల్గొండలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడిన తీరుపై చర్చించేందుకు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వొస్తే.. నేడు సాయంత్రం వరకూ చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక ఆరవ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరాగాయి. అసెంబ్లీలో సిఎం మాట్లాడుతూ..మేడిగడ్డ మొత్తం కుంగిపోయి ఉంటే.. చూడటానికి కూడా రాని బీఆర్‌ఎస్ సభ్యులు.. బ్యారేజీ కుంగుబాటుకు కాంగ్రెస్సే కారణమని ఎలా మాట్లాడుతారని ఫైరయ్యారు. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కేసీఆర్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు.
ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని అనడం సబబు కాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్యాంట్ ఊడపీకారని, ఉన్న అంగీని కూడా ప్రజలు పీకేస్తారన్నారు. మేడిగడ్డపై ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ చూడటానికి మేడిపండులా ఉందని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుందని బీఆర్‌ఎస్ సభ్యుల్ని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేసీఆర్ లకే మేడిగడ్డ బాధ్యతల్ని అప్పగిస్తామని, మేడిగడ్డలో నీళ్లు నింపి.. అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎలా పోస్తారో చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వీధి నాటకాలు ఆడుతున్నారని, చర్చకు రావడానికి భయమేసే మేడిగడ్డను చూడటానికి రాలేదని దుయ్యబట్టారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా పూర్తి కాకుండానే ఆరు గ్యారెంటీలపై అబద్ధాలు చెప్పామనడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, లక్షరూపాయల రుణమాఫీ హామీలను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో గాలికి వదిలేసిందని విమర్శించారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీలను చేసి చూపిస్తామన్నారు. ప్రజలు రెండేళ్లు అవకాశమిచ్చినా.. విద్యను, వైద్యను గాలికి వదిలేసి, నిరుద్యోగులను మోసం చేసి, రైతులను నిట్టనిలువునా ముంచేసిన ఘనత బీఆర్‌ఎస్ కే దక్కుతుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ దే నని ఎమ్మెల్యే రాజగోపాల్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేసి చూపిస్తామన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనండి అని అడిగితే.. పారిపోతారని విమర్శించారు. అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.





