కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌ ‌బై చెప్పాలి

  • తెలంగాణను అప్పులపాలు…
  • రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి
  • బీఆర్‌ఎస్‌ ‌పేరుతో తెలంగాణ తల్లి విలువలకు తూట్లు
  • కెసిఆర్‌కు తదుపరి విఆర్‌ఎసే
  • రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే
  • ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు మహా సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్‌ ‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ..ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వొచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్‌ల ఆశీర్వాదం తీసుకుని, తాను  మాట్లాడుతానని.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్‌ ‌మీకు దొరికాడా? లేడా? అని ప్రజలను ప్రశ్నించారు. పాదయాత్ర 1403 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, కరీంనగర్‌కు వొచ్చింది..ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర.. ప్రజల గోసకు బీజేపీ భరోసా కల్పిస్తుందన్నారు. సాలు దొర.. సెలవు దొర పక్కా అంటూ జోస్యం చెప్పారు. ఇక, తాను వొచ్చేటప్పుడు తన పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారంటూ బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులపై ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా. కేసీఆర్‌ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారన్న ఆయన..

కేసీఆర్‌ ‌ప్రభుత్వం ‘అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక’ ప్రభుత్వంమని, కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌ ‌బై చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు.. సబ్‌ ‌కా సాత్‌.. ‌సబ్‌ ‌కా విశ్వాస్‌ అన్నది మోడీ పాలనలోనే జరిగిందని, ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్న ఆయన.. జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌కింద భారీగా నిధులు ఇచ్చామని, కానీ మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చాడని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ‌పాలనలో రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. కేసీఆర్‌ ‌తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుందని ఎద్దేవా చేశారు.. టీఆర్‌ఎస్‌ ‌నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన కేసీఆర్‌ ‌పార్టీకి నెక్సట్ ‌విఆర్‌ఎస్‌ ‌తప్పదని జోస్యం చెప్పారు.. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్‌.. ఆ ‌హామీని నిలబెట్టుకున్నాడా? అని నిలదీశారు.

తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్‌ ‌లూఠీ చేస్తున్నాడని ఆరోపించారు జేపీ నడ్డా.. ‘‘ధరణి పోర్టల్‌’’ ‌పేరుతో.. బీఆర్‌ఎస్‌ ‌నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారన్న ఆయన.. అసదుద్దీన్‌ ఒవైసీకి భయపడే.. సెప్టెంబర్‌ 17‌ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్‌ ‌జరపడంలేదన్నారు.. సెప్టెంబర్‌ 17‌ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపిందని గుర్తుచేశారు. ఇక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. కేసీఆర్‌ ‌నిరుద్యోగ భృతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైంది? వెల్నెస్‌ ‌సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు.. వెల్నెస్‌ ‌సెంటర్‌ ‌లకు బస్తీ ధవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. బస్తీ ధవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్న ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ ‌నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి.. తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ.. బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాదయాత్రలు ఆగవు.. పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయి. ప్రతి గడిపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాం.. తెలంగాణలో కేసీఆర్‌ ‌పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *