గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్ ఏమైంది?
డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది?
డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా?
ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే
జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది?
వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతేంది?
పాద యాత్ర సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నల వర్షం
కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : మినీ భారత్‌గా కన్పించే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వర్ణణాతీతమని, పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. ఒకవైపు కంపెనీల కాలుష్యం, మరోవైపు డ్రైనేజీ దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం 2వ రోజు బండి సంజయ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. దారి పొడవునా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వందలాది దరఖాస్తులు బండి సంజయ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కుత్బుల్లాపూర్ సమస్యలను, టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయని, కనీస మౌలిక సౌకర్యాలు లేవని, విద్యార్థులంతా నేలపైనే కూర్చుని చదువుకుంటున్నరని, చివరకు టీచర్లు కూర్చుంటానికి కుర్చీలు కూడా లేవు.. ‘మన బస్తి – మన బడి’ అని కొత్త స్కీమ్ పెట్టి చేసిందేమీ లేదన్నారు. వొచ్చిన పైసలను సంపుకునుడు తప్ప…ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీకి సొంత భవనం లేదని, జూనియర్ కాలేజీలోనే క్లాసులు నిర్వహిస్తున్నారని, పీజీ కాలేజీ లేదు, పారిశ్రామిక వాడగా మారిన నియోజకవర్గంలో కనీసం ఒక్క ప్రభుత్వ ఐటిఐ కాలేజ్, పాలిటెక్నిక్ కళాశాల లేదని, నియోజకవర్గానికి ఒక 100 పడకల హాస్పిటల్‌ని ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీకి దిక్కులేదని విమర్శించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీస సౌకర్యాల్లేవని, బస్తీ దవాఖానాల పేరిట హడావిడి చేసిన ప్రభుత్వం అవి ఎక్కడున్నాయో కూడా ప్రజలకు తెలియని దుస్థితి ఏర్పడిందని, టిమ్స్ హాస్పిటల్(100 పడకల దవాఖాన)ని మొదట కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయిస్తే, మంత్రి హాస్పిటల్సన్నీ ఇక్కడే ఉన్నాయని.. వ్యాపారం దెబ్బతింటదని అల్వాల్‌కు తరలించారన్నారు. ఎక్కడ చూసినా మంజీరా నీటిలో డ్రైనేజీ నీరు కలిసి త్రాగునీరు కలుషితమైతుందని, డ్రైనేజీ పొంగి పొర్లి నిత్యం రోడ్లపైకి వస్తున్నా స్పందించరని అన్నారు. బిజెపి ఆధ్వర్యంలో అనేకసార్లు జలమండలి వద్ద ధర్నాలు చేపట్టినా అధికారుల నుంచి స్పందన లేదని, కలుషిత నీటి వల్ల ప్రజలు రోగాలతో అల్లాడుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించరన్నారు.
దోచుకోవడం…దాచుకోవడమే వారి పని అని, ఇందులో ఒకాయన ట్విట్టర్ టిల్లు బినామీ అని ఎద్దేవా చేశారు. జగద్గిరిగుట్టలో తెలంగాణలోని అన్ని జిల్లాల వాసులున్నారని, వివిధ జిల్లాల నుండి దాదాపు 50 నుండి 60 బస్సులు రోజూ ఇక్కడికి రావడం జరుగుతుందని, సిటీ బస్సులు దాదాపు వందదాకా ఉన్నయన్నారు. జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ నెరవేరలేదని, సీఎం బిడ్డ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వొచ్చి జగద్గిరిగుట్టకు బస్ డిపో, జూనియర్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్‌ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా వాటికి అతీగతీ లేదని గుర్తుచేశారు. నియోజకవర్గంలో భూకబ్జాలకు అంతులేదని, చివరకు దేవుని మాన్యాలను కబ్జా చేశారని, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయానికి 14 ఎకరాలుంటే టీఆర్‌ఎస్ నేతలతో కబ్జాలతో ఇప్పుడు 2 ఎకరాలకే పరిమితమైందన్నారు. ఈ నియోజకవర్గంలో 93 చెరువులుంటే…వాటి చుట్టూ కబ్జాలే…అవి కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నయన్నారు. మురికి నీటితో దర్శనమిచ్చి భూగర్భ జలాలని కాలుష్యం చేస్తున్నాయని, కుత్బుల్లాపూర్‌ను మోడల్ మున్సిపాలిటీని, మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న మాటలన్నీ ఒట్టివే అని కొట్టిపారేశారు. ఇదేనా మోడల్ అంటే..మిషన్ భగీరథ ద్వారా మినరల్ వాటర్ అందిస్తామన్న సీఎం, ట్విట్లర్ టిల్లు హామీలకు దిక్కులేదని, తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లే రావడం లేదన్నారు. షామీర్ పేట దగ్గర కేశవ్పూర్ రిజర్వాయర్ చేస్తానన్న హామీ ఇంతవరకు పూర్తి కాలేదని,డ్రైనేజ్ వ్యవస్థ అధ్వాన్నం… నేను పాదయీత్ర చేస్తున్న చోట కూడా డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వొచ్చి వాసన కొడుతున్న దృశ్యాలను కళ్లారా చూశానన్నారు..ఇక్కడోళ్లు ఈ వాసనను ఎట్ల భరిస్తున్నరో అర్ధం కావడం లేదన్నారు. ఇగ రోడ్ల వ్యవస్థ అధ్వాన్నం అని, కేంద్ర నిధులతో వేసిన మెయిన్ రోడ్లు తప్ప ఏ గల్లీలో చూసినా గుంతల రోడ్లే కన్పిస్తున్నయని, గుంతకో వెయ్యి రూపాయలిస్తానన్న ట్విట్టర్ టిల్లు…ఒకసారి ఈ నియోజకవర్గానికి రా..ఎన్ని గుంగలున్నయో తెలుస్తదన్నారు.
ఈడ గుంతలకు పైసలియ్యాలంటే…జీహెచ్‌ఎంసీ బడ్జెట్ కూడా సరిపోదేమో అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికుల్లో 90 శాతం మంది ఈడనే ఉంటరని, వొచ్చేదే అరకొర…అందులో అన్నీ కటింగులేనని, ఈడ వేల మంది నివసిస్తున్న భూములు వక్ఫ బోర్డువని చెబుతూ ఇబ్బంది పెడుతున్నరని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డు భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కొంపల్లిని ఐటీ హబ్‌గా మారుస్తానన్న హామీ గాలికొదిలేశారని, ఈ నియోజకవర్గంలో వేలాది మంది పేదలు 60 గజాల జాగలల్ల ఇండ్లు కట్టుకుని దశాబ్దాల నుండి నివసిస్తున్నరని, వాళ్లకు పట్టాలిస్తానని రెండు ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ నేతలు మాట తప్పి వేధిస్తున్నరని, ఖాళీ చేయాలంటూ నోటిసులిచ్చి ఇబ్బంది పెడుతున్నరని, బీజేపీ అధికారంలోకి రాంగనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇండ్లు లేనోళ్లు లక్షల్లో ఉన్నరని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఇక్కడ లక్ష మందికి పైగా ప్రభుత్వానికి ధరఖాస్తూలు పెట్టుకున్నారని, 13 వేల ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి 3 వేల ఇండ్లు కట్టిస్తామన్నరు. అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు..బీజేపీ అధికారంలోకి రాంగనే ఇక్కడే కాదు..రాష్ట్రంలో ఇండ్లులేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నానని బండి సంజయ్ కుమార్ అన్నారు.



