కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..

  • సిఎం రేవంత్‌వి వ్యర్థ ప్రయత్నాలు
  • తెలంగాణ భవన్‌ మేడే వేడుకల్లో కెటిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లులేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్‌ రెడ్డి వల్ల కాదు కదా..ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మే డే వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడుతూ..చెమటబొట్టే చరిత్రకు ఆధారం అని అలిశెట్టి ప్రభాకర్‌ అన్నారని, శ్రామికులే చరిత్ర నిర్మాతలని, కార్మికులే సంపద సృష్టికర్తలు.. శ్రమైన జీవన సౌందర్యానికి సమానమైనది ఏది లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిదని, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగ్‌ సైరన్‌ చేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయిందని, వారు తమ సత్తా చాటారన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా అండగా నిలిచారని, పబ్లిక్‌ సెక్టార్‌లో పని చేసే కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణలో అద్భుతాలు జరిగాయన్నారు.

అలా పని చేసిన కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని, కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్‌ రెడ్డి వల్ల కాదు.. ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. చిన్నచితకా పని చేయలేదని, కాళేశ్వరం నిర్మించామని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమ ఉందని, తాజ్‌మహల్‌ను తలదన్నేలా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నిర్మించామని, అందులోనూ మన కార్మికుల శ్రమ ఉందని, అద్భుతమైన యాదాద్రి నిర్మాణంలో వందలాది కార్మికుల శ్రమ ఇమిడి ఉందన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే కాళేశ్వరం కూల్చేయాలని, యాదాద్రి ఆలయం, సెక్రటేరియట్‌, అంబేద్కర్‌ విగ్రహం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వంటి వాటిని కూల్చేయాలని కేటీఆర్‌ తెలిపారు. వీటన్నింటికి మించి తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని, ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్‌ అన్నారు. ఇక ఈయన మళ్లా తన పాత బాస్‌తో మాట్లాడుకుని అటుఇటు చేసి కలుపుకుంటే తప్ప కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేసే సత్తా రేవంత్‌ రెడ్డికి కానీ, ఆయన ప్రభుత్వానికి గానీ లేదని, ఆ విషయంలో మనకు రెండో అభిప్రాయం అవసరం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను తెర్లు కానియ్య..
మానుకోట ప్రాంతాన్ని ఎడారి చేసింది ఎవరు…. జిల్లాను తీసివేసేందుకు కాంగ్రెస్‌ కుట్రలు
కవిత గెలుపుతోనే గిరిజన పార్లమెంట్‌ అభివృద్ధి… కర్నార్‌ మీటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

మహబూబాబాద్‌, ప్రజాతంత్ర. మే 1 : తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణను తెర్లు కానియ్యనని…ఐదు నెలలోనే ఎడారిగా మార్చిన పాపం ఎవరిదని మాజీ ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఅర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత గెలుపు కోసం ఏర్పాటు చేసిన  కార్నార్‌ సమావేశంలో ఎన్నికల ప్రచార రథంపై నుంచి కెసిఆర్‌ మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చారని, రైతులకు రైతు బంధు.. రుణమాఫీ, కల్యాణ లక్ష్మి పథకాలు ఎవైనా ఇస్తున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. మోదీ పాలనలో బ్యాంకులో 15 లక్షలు వేస్తానని వేశారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌ జిల్లాలో నీటి సమస్య బాగా వుంటుందని బిఅర్‌ఎస్‌ పాలనలో నీటి కష్టాలు రాకుండా నీటిని అందించామని, నేడు ఎడారిగా మారడం చూస్తే బాధగా వుందని అన్నారు.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహబూబాబాద్‌ జిల్లాను తీసివేసే కుట్రలు చేస్తున్నారని, గిరిజన జిల్లా అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడితే నేడు కాంగ్రెస్‌ ధ్వంసం చేసే కుట్రలు చేస్తున్నదని, వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు పనిచేసి గెలిపించాలని అన్నారు. ప్రచారంలో ఆయన వెంట  బిఅర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాలోత్‌  కవిత, రాజ్య సభ సభ్యులు వద్ధిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ రవీందర్‌ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్‌ రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బిందూ, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, శంకర్‌ నాయక్‌, సుదర్శన్‌ రెడ్డి, నాయకులు గుడుపూడి నవీన్‌, కుడితి మహేందర్‌, మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రామ్‌ మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెంకన్న, పర్కాల శ్రీనివాస్‌ రెడ్డి, బీరవెల్లి భారత్‌ కుమార్‌ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *