- పిసిసి అంటే…పేమెంట్, కలెక్షన్, సెంటర్
- గజ్వేల్‌లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు
- రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ
- గజ్వేల్ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : కేసీఆర్ అంటే ప్రగతి…కాంగ్రెస్ అంటే అధోగతి…పిసిసి అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కొత్త నిర్వచనం చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 530 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. గజ్వేల్‌లో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కేసీఆర్ అంటే ఒక నమ్మకం అని, కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పని, చెప్పిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం. నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మనం మోసపోతామన్నారు. కాంగ్రెస్ అంటే ఒక కమిషన్ టికెట్లు, అప్లికేషన్‌కు పైసలు, టికెట్ ఇవ్వాలంటే పైసలు వసూళ్ల సెంటర్‌గా గాంధీభవన్‌ను మలిచారన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు సిఎం కేసీఆర్ శుభవార్త తెలిపాడనీ… పదివేల మందికి గృహలక్ష్మీ ఇండ్లు మంజూరు చేశాడనీ, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇవాళ 530 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందనీ, 300కోట్లతో నిర్మించుకున్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభించుకున్నామనీ, 150 కోట్లతో గజ్వేల్ మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించుకున్నామనీ, అదేవిధంగా 36 కోట్లతో వంద పడకల మాతాశిశు దవాఖానను ప్రారంభించుకున్నామన్నారు. మాతాశిశు దవాఖాన ద్వారా గర్భిణీలకు చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించబడుతుందనీ, కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అందరి అదృష్టమన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనీ, నీళ్లు మోపిస్తారేమోనని గజ్వేల్ ప్రాంతానికి గతంలో పిల్లని ఇవ్వాలంటే భయపడేవారన్నారు. ఇవాళ పోయికాడికి మంచినీళ్లు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు.
అదేవిధంగా ఇవాళ గజ్వేల్‌కి రైలు వచ్చిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. దేశంలో గజ్వేల్ ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందనీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూసి అధ్యయనం చేసే స్థాయికి గజ్వేల్ చేరిందన్నారు. పనిచేసే కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే కేసీఆర్ మన గౌరవం పెంచుతాడనీ, మనల్ని కాపాడుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, మరింత అభివృద్ధిలో గజ్వేల్ కొనసాగాలన్నా రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సిఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామనీ మంత్రి హరీష్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గుండా రంగారెడ్డి, గజ్వేల్ ఆత్మ కమిటీ ఛైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, గజ్వేల్ మునిసిపల్ ఛైర్మన్ నేతి చిన రాజమౌళి, ఎంపిపి దాసరి అమరావతి, ఏఎసిం ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఏకగ్రీవాల వెల్లువ..మంత్రి హరీష్‌రావుకు ఏకగ్రీవాల కాపీల అందజేత…
మంగళవారం మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సిఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామనీ తెలుపుతూ…వివిధ కుల, వ్యాపార వాణిజ్య సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆర్థిక, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావుకు అందించారు. గజ్వేల్ మండల కుమ్మరి సంఘం, గజ్వేల్ నియోజకవర్గ రైస్ మిల్లర్లు, గజ్వేల్ పట్టణ పద్మశాలి సమాజం, గజ్వేల్ వైశ్య సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం కాపీలను మంత్రికి అందించారు. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేసిన ఈ పదేళ్లలో గజ్వేల్ ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందని గజ్వేల్ పేరు చెబితేనే అన్ని ప్రాంతాలలో గౌరవం పెంచే విధంగా కేసీఆర్ పనిచేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి సైతం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వొచ్చి గజ్వేల్ అభివృద్ధిపై అధ్యయనం చేసే స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. ఇంత గొప్ప స్థాయిలో అభివృద్ధి చేసిన కేసిఆర్ నాయకత్వాన్ని మాత్రమే తామంతా కోరుకుంటున్నామనీ, గజ్వేల్ గడ్డమీద కేసిఆర్‌కు తప్ప మరొకరికి స్థానం లేదన్నారు. గజ్వేల్ నుండి మరోసారి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తేనే ఈ అభివృద్ధి పరంపర కొనసాగుతుందనీ, లేకుంటే గజ్వేల్ ప్రజలు నష్టపోతారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరాటం అంతా కేవలం డిపాజిట్ల కోసమే తప్ప అఖండ మెజారిటీతో గజ్వేల్ గడ్డమీద మరోసారి కేసీఆర్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమనీ ఏకగ్రీవ తీర్మానాల్లో పేర్కొన్నారు.





