కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే..

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌నిందితులను అరెస్టు చేస్తే చీకటి రోజా?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో అందరూ ఒకటేనని.. లిక్కర్‌ ‌స్కామ్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్ ‌కావడాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ‌బ్లాక్‌ ‌డేగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు.  కేసీఆర్‌ ‌బలవంతంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎంపీలతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…దిల్లీలో తీగలాగితే తెలంగాణలో డొంక కదిలినట్లు లిక్కర్‌ ‌కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడిందన్నారు. కవితను దృష్టిలో పెట్టుకొని దిల్లీలో లిక్కర్‌ ‌కుంభకోణం దర్యాప్తు జరగలేదని,  దిల్లీ అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్‌ ‌దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేశారు. దిల్లీలో కేజ్రీవాల్‌ ‌లిక్కర్‌ ‌పాలసీలో మార్పు చేస్తున్నపుడు..ఆ పాలసీకి కేసీఆర్‌ ‌కుమార్తె కవిత పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఆ పాలసీ వెనకాల కవిత హస్తమున్నట్లు సీబీఐ గుర్తించి ఈడీకి విచారణ కోసం ఆదేశించడంతో  వ్యవహారం బయటపడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐ, ఈడీ చేసే దర్యాప్తులకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నా..

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌  ‌నాయకులు, మమతా బెనర్జీ వంటి వారు బీజేపీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కవిత, కేజ్రీవాల్‌ ‌చేసిన అవినీతి కుంభకోణాలపై విచారణ జరపకుండా విడిచిపెట్టమంటారా అని కేసీఆర్‌ని కిషన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నేరుగా లిక్కర్‌ ‌వ్యాపారం చేసి వేల కోట్లు అక్రమంగా సంపాదించడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ..అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడం నిజంగా బ్లాక్‌ ‌డేనే అని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలకు తేడా లేదని,  కేసీఆర్‌ ‌ప్రభుత్వం పెట్టిన ఓపెన్‌ ‌బార్లు, బెల్ట్ ‌షాపులను తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు పని చేస్తున్నాయన్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.4000 కోట్లు ఉంటే..2023లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం కోల్పోయే నాటికి రూ.44 వేల కోట్లకు పెరిగిందని, ఈ ఘనత బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనన్నారు.

ఇదే లిక్కర్‌ ‌బిజినెస్‌ ‌మోడల్‌ అని ఆప్‌ ‌ప్రభుత్వానికి బదిలీ చేశారని విమర్శించారు. దిల్లీ లిక్కర్‌ ‌వ్యాపారంలో కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు ఎందుకు భాగస్వాములయ్యారో చెప్పాలని, దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌, ‌కవితకు అనేక సార్లు నోటీసులు ఇస్తే తప్పించుకుని తిరిగి, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆప్‌ ‌ప్రభుత్వం లిక్కర్‌ ‌విషయంలో వందల కోట్ల అవినీతికి పాల్పడిందని తాము నిరూపిస్తామని, అది తప్పని కేసీఆర్‌ ‌నిరూపిస్తారా..? అని ప్రెస్‌ ‌క్లబ్‌, అమరవీరుల స్థూపం వద్ద చర్చించడానికి కేసీఆర్‌ ‌సిద్ధమా..? అని కిషన్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. కవిత అరెస్టుకు, తెలంగాణ రాజకీయాలకు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుపై కాంగ్రెస్‌ ‌నాయకులు విమర్శిస్తున్నారని, కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే అవినీతి అని, కుంభకోణాల పార్టీ అని, తెలంగాణ అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లోనే అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు..అంటూ కిషన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ ‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి చాలెంజ్‌ ‌చేశారని,  అమిత్‌ ‌షా అపాయింట్‌ ‌మెంట్‌ ఇప్పించాలని..తన వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని… సీబీఐ దర్యాప్తులో అవినీతి నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నారని, కానీ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదో రేవంత్‌ ‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 100 రోజులు మాటలతోనే గడిపిందని, బీఆర్‌ఎస్‌ ‌చేసిన అవినీతిని, కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మాటలతోనే సరిపెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ ‌చుట్టు ప్రక్కల లక్షలకోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులకు అప్పజెప్పారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారని, ఇప్పుడెందుకు దర్యాప్తు  జరిపించడం లేదని ప్రశ్నించారు. కంపెనీలను, బిల్డర్లను, కాంటాక్టర్లను బెదిరించి డబ్బులు వసూల్‌ ‌చేసి కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ ‌ప్రభుత్వం చేసిన అవినీతి, కుంభకోణాలను సమర్ధించే స్పోక్స్ ‌పర్సన్స్‌గా బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌టీఎంసీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకే మజ్లిస్‌ ‌పార్టీ మద్దతు తెలుపుతుందని, రాష్ట్రంలో  బీజేపీకి 17కు 17సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తుందని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *