కెసిఆర్‌ ‌పతనం మొదలయ్యింది

  • మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది
  • టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు
  • టిఆర్‌ఎస్‌ ‌తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే
  • ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ ‌ప్రకటన

ఖమ్మం,ఏప్రిల్‌26: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్వలు చేశారు. వరంగల్‌ ‌సభ నేపథ్యంలో ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ఇతర పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న  అధికారుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నానని, మిత్తి సహా వారికి తిరిగి చెల్లిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఆ ఆఫీసర్లు రిటైర్‌ అయినా వారిని కోర్టుకు లాగుతామని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్‌ ‌ఖిల్లా అని మరోసారి నిరూపించాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

జిల్లాలో చనిపోయిన రైతుల సాక్షిగా వరంగల్‌ ‌జిల్లాకు అందరూ కదలిరావాలని అన్నారు. 42 లక్షల మంది కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ప్రతి బూత్‌ ‌నుంచి 9 మంది సభకు తరలిరావాలని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు రేవంత్‌ ‌రెడ్డిని కలిసేందుకు పోటీ పడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌పై రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే  బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు.

బీజేపీ కార్యకర్త మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్‌ ఆరోపించారు. మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు. మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్‌ ‌కోరారు. అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌వి•ట్‌ ‌రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు గుంపులు గుంపులుగా స్టేజీపైకి దూసుకెళ్లారు. దీంతో కార్యాలయం రెండు ద్వారాల అద్దాలు ధంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కార్యకర్తల తీరుపై రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *