చింతమడకను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే…
దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కోసం ఈసీని అనుమతి ఎందుకు కోరలేదు..!
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయిస్తా
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ లో చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్, కొడుకు, కూతురు, అల్లుడ్ని చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి అక్కడే ఉంచుతానని టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్ విజయభేరి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆలస్యంగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు కొల్లగొట్టారని.. 10 వేల ఎకరాల భూములు లాక్కున్నారని వీటిపై విచారణ జరిపిస్తామన్నారు. పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఎలాగో కట్టివ్వలేదని ఆయన కోసం చర్లపల్లి జైల్లో సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందని ప్రశ్నించే వారు ఓసారి ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో బడి, గుడి, వాటర్ ట్యాంకు రోడ్డు రవాణా వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అని గుర్తు చేసుకోవాలన్నారు. కెసిఆర్ కుమారుడు కేటీఆర్ నేర్చుకున్న కంప్యూటర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో సోనియాగాంధీ పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమదేనన్నారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందన్నారు. దళిత గిరిజనులకు అసైన్ పట్టాలు ఇచ్చి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందన్నారు. నిధులు నీళ్లు నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణలో కెసిఆర్ పాలన వెనుకబాటుకు కారణమైందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాక పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు ఆగలేదన్నారు. ఆ జిల్లా నీకు ఎంపీ చేసిన అక్కడి ప్రజల బతుకులు మారలేదని ఎద్దేవా చేశారు. జిల్లాపై కనికరం చూపి అభివృద్ధి చేయకుండా ఉత్త మాటలతో కాలం వెళ్లదీశారని కెసిఆర్ ని ఉద్దేశించి రేవంతన్నారు. విద్యార్థుల కోసం కేజీ టు పీజీ, 100 పడకల ఆసుపత్రి ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలు హామీగానే మిగిలిపోయింది అన్నారు. నమ్మించి నట్టేట ముంచే ముఖ్యమంత్రి కావాలా పేదలను ఆదరించే ఇందిరమ్మ రాజ్యం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కలిసి ఎన్నికల కమిషన్ నుంచి రైతుబంధుకు అనుమతి పొందారని మరి దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందుకు అనుమతి పొందలేదని ఆయన ప్రశ్నించారు, ఎలక్షన్ కమిషన్ నుండి ఈ పథకాల కోసం అనుమతి పొందాలని లేకుంటే అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరి నెలలో ఆగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 15000 చొప్పున రైతుబంధు తాము ఇచ్చే వారం అన్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీ బందు కోసం ఎందుకు మాట్లాడడం లేదని మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాడు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు గ్రామాలకు రాకుండా వారిని బంధు పెట్టాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నా సొంత గడ్డ అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కసిరెడ్డి నారాయణరెడ్డిని 25 వేల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనివార్య కారణాలవల్ల షాద్నగర్ బహిరంగ సభకు వెళ్లలేదని వీరన్న గెలిపించాలని ఈ సభా వేదికగా కోరుతున్నాం రేవంత్ రెడ్డి చెప్పారు. మోదీ కేడి ఇద్దరు ఒక్కటేనని బిఆర్ఎస్ కు వేసిన ఓటు బిజెపికి చేరుతుందన్నారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలతో నినాదాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రి సుధాకర్, సిడబ్ల్యుసి సభ్యులు వంశీచందర్ రెడ్డి, ఎంపీ షకిల్ అహ్మద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు మాణిక్ రావు ఠాక్రే, పివీ మోహన్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, మల్లు రవి, బాలాజీ సింగ్ తదితరుల పాల్గొన్నారు.




