కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కేటాయించాలి..

  • ప్రాజెక్ట్‌లపై కేంద్ర గెజిట్‌ ‌రద్దుచేయాలి
  • తెలంగాణ విభజన హామీలను వెంటనే అమలు చేయాలి
  • కేంద్ర మంత్రులను కలిసిన టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌  

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కేటాయించాలని, రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శేఖావత్‌ను, కేంద్ర డిప్యూటీ హోమ్‌ ‌శాఖ మంత్రి  నిత్యానంద రాయ్‌ ‌లనుబుధవారం దిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రిష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా రాకుండా ఆంధ్ర నాయకులు  ఎక్కువ నీటిని వాడుకున్నారు. ఈ అన్యాయం తట్టుకోలేకే  దశాబ్దాలపాటు పోరాడి ఎన్నో త్యాగాలతో బలిదానాలతో  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయినా ఆంధ్ర రాయలసీమ నాయకులు  కృష్ణా నది నుండి అక్రమంగా తరలించుకు పోతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌కెపాసిటీ పెంచుకొని నీళ్లు తరలిస్తున్నారు.

తెలంగాణలో 68.50 శాతం పరివాహకప్రాంతం ఉండగా కేవలం 37 శాతం మాత్రమే…299 టియంసిలు తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రకు 512 టియంసిలు కేటాయించారు. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని సరిచేసి తెలంగాణకు న్యాయమైన వాటా కేటాయించాలని కోదండరామ్‌ ‌కోరారు. ఇప్పటికే తెలంగాణ తన వాటా కోల్పోయి నష్ట పోతుండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వొచ్చిన గెజిట్‌ ‌తెలంగాణకు పెద్ద ప్రమాదాన్ని తీసుక వొచ్చింది. ఇప్పటికే నిర్మాణంలో వున్న పెండింగ్‌ ‌ప్రాజెక్ట్‌లను నిలిపి వేయమని ఆదేశాలిచ్చింది. ఫలితంగా తెలంగాణ కృష్ణా నదిలో తన వాటాను వినియోగించుకునే పరిస్థితి లేక నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం వుందని కోదండరామ్‌ ‌కేంద్ర మంత్రికి వివరించారు.

విభజన సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలైన గిరిజన యూనివర్సిటీ, ఉద్యోగులు, 89 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, 107 రాష్త్ర స్థాయి సంస్థల విభజన సత్వరమే చేయాలని, ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని కోరారు. రైల్వే కోచ్‌, ‌బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ, హార్టి కల్చర్‌ ‌యునివర్సిటీ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోదండరామ్‌ ‌కేంద్ర డిప్యూటీ హోమ్‌మంత్రి ని కోరారు. ప్రొ.కోదండరామ్‌ ‌వెంట జనసమితి నాయకులు  అంబటి శ్రీనివాస్‌, ఆశప్ప, శ్రీధర్‌ ‌ఖాదర్‌ ‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *