కూల్చివేతల లొల్లి..!

కూల్చివేతల్లో ఎవరి ఘనత ఏమిటన్న విషయంపైన దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఒక వైపు దేశంలో అత్యున్నత చట్టసభ  పార్లమెంట్‌ ‌సమావేశాలు, మరోవైపున  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ఆయా రాజకీయ పార్టీల విధానాలను తెలిపేవిగా ఉన్నాయి.  ముఖ్యంగా కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌నేడు పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీల పాలనా తీరుకు ఈ చర్చ అద్దం పట్టేదిగా ఉంది. మొత్తం మీద తాజా పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడంలో ఈ రెండు పార్టీల చరిత్ర ఘనమైనదేనన్న విషయం వెల్లడయింది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తమ పార్టీయే అధికారంలో ఉండాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యవహరిస్తున్నదంటూ ఇటీవల కాలంలో కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌తోపాటు బిజెపియేతర  ప్రభుత్వాలు ఘాటుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దానికి తగినట్లు బిజెపి చర్యలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత  పలు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన జిమిక్కులు బహిరంగ రహస్యమే. తాజా లోక్ సభ సమావేశాల్లో ఇదే అంశంపైన చర్చ జరిగింది. తమ పార్టీపైన వొస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వకుండా, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ‌ఘన చరిత్రేమిటన్నది ప్రధాని మోదీ వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారు.
మోదీ తన సుదీర్ఘ ప్రసంగంలో 356 ఆర్టికల్‌ను దుర్వినియోగం చేసిందే  కాంగ్రెస్‌ అం‌టూ, అసలు ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ఆర్టికల్‌ను దాదాపు 90 సార్లు ప్రయోగించడం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర ఆ పార్టీదేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ఆ పార్టీకి చెందిన ఒక ప్రధాని 356 ఆర్టికల్‌ను యాభై సార్లు వాడుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ ప్రధాని ఎవరో కాదు ఇందిరాగాంధీనే అంటూ దానికి ముక్తాయింపు ఇచ్చారు. దీనిపై ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పడదోసిందెవరని ఆయన ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీఆర్‌ ‌పదవీ బ్రష్టుడు కావడానికి ఆనాటి ఏపి గవర్నరే కారణమన్న విషయం తెలియందికాదు. కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గవర్నర్‌ ‌ద్వారా ఎన్టీఆర్‌ను ఇబ్బంది పాలుచేసిందనడానికి చరిత్రే సాక్ష్యం. అదే విషయాన్ని ఆయన నిండు సభలో ఊటంకించారు. అంతేకాదు, తమిళనాడులో ఎంజీ రామచంద్రన్‌ ‌ప్రభుత్వాన్ని కూలదోయటంలో మహారాష్ట్రలో శరద్‌పవార్‌, ‌కేరళలో వామపక్షాలను ఇబ్బంది పెట్టింది కాంగ్రెసేనని ఆయన గుర్తుచేశారు.
ఆనాడు కాంగ్రెస్‌ ‌పక్షాన నిలబడిన వారే నేడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, వారిలో కొందరు ఈ సభలోనే ఉన్నారంటూ అయన బిఆర్ఎస్   సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఇదిలా ఉంటే కేంద్రంలో బిజెపి అధికారంలో కొనసాగుతున్న ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిందని కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌పార్టీలు చాలా కాలంగా ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ ఎనిమిది రాష్ట్రాల్లోకూడా అధికారం చేపట్టే మెజార్టీ లేకున్నా, రాజకీయ ఎత్తుగడలతో  బిజెపి ఆ రాష్ట్రాలను హస్తగతం చేసుకుందని బిజెపి యేతర ప్రభుత్వాలు నిత్యం ఘోషిస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడు తెలంగాణ, ఏపి, దిల్లీ, రాజస్థాన్‌ ‌రాష్ట్రాల్లోకూడా అదే కుటిలనీతిని ప్రదర్శించే ఎత్తుగడలు వేస్తోందంటూ ఇటీవల ఎంఎల్ఏల ఎర కేసు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆరోపించిన విషయం తెలియందికాదు. తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని పడదోసేందుకు పలువురు ఎంఎల్ఏల కొనుగోలు  బేరాన్ని తమ ప్రభుత్వం బట్టబయలు చేసిందని, కొనుగోలుకు వొచ్చినవారంతా బిజెపి సన్నిహితులేనంటూ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ విషయంలో పట్టుబడ్డవారు తాము ఏ ప్రభుత్వాన్ని ఎలా కూల్చామన్న విషయాన్ని వివరించిన  ఆడియో టేపులను కోర్టుకు అందజేసినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది.
ఈ విషయం ఇంకా కోర్టు విచారణలో ఉంది. అక్కడ ప్రభుత్వాల కూల్చివేతలపై విమర్శలు కొనసాగుతుంటే, రాష్ట్రంలో భవనాల కూల్చివేతపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్‌ను కూల్చివేయడమే సమంజసమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ భవనాన్ని నక్సలైట్లు కూల్చాలనడం పెద్ద వివాదగ్రస్తంగా మారింది. ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాల ఒక నాయకుడు ఇలా వ్యాఖ్యానించడమేంటని అధికార పార్టీ విరుచుపడుతుంటే, కాంగ్రెస్‌తో పాటు ఇతర నాయకులు కొందరు దాన్ని సమర్థిస్తున్నారు. దీనికితోడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరో వివాదస్పద ప్రకటన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయం   పైన నిర్మించిన గుమ్మటాలను కూల్చివేస్తామనడం మరో వివాదానికి దారితీసింది. సుమారు 1500 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ సెక్రటేరియట్    పైనున్న గుమ్మటాలు పూర్వ రాజుల నిర్మాణాలను పోలి ఉండడం రాజరికాన్ని తలపించేదిగా   ఉన్నాయని, అందుకు తాము అధికారంలోకి రాగానే వాటిని కూల్చివేస్తామన్నారు. అటు ప్రభుత్వాలు, ఇటు భవనాల కూల్చివేతలిప్పుడు ప్రధాన చర్చనీయాంశాలైనాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *