కొచ్చి,జూన్14: కువైట్‌లోని అల్ మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్‌కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారిపోయింది.
అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు. మృతదేహాలను తరలించేందుకు భారత వాయుసేన గురువారం రాత్రి ఓ విమానాన్ని కువైట్ చేరుకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం.. అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రమంత్రి కీర్తివర్ధన్‌ను అక్కడకు పంపింది. మృతుల్లో 23 మంది కేరళవాసులు కాగా.. ఏడుగురు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ఏపీకి చెందినవారు ముగ్గురు. ఒక కర్ణాటక వ్యక్తి ఉన్నారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్టాల్రకు చెందిన వ్యక్తులు. దాంతో కొచ్చి తర్వాత ఈ విమానం దిల్లీకి వెళ్లనుంది.



