ఆర్థికంగా ఎదిగేందుకు కులవృత్తులకు సిఎం కేసీఆర్ ప్రోత్సాహం
వొచ్చే విద్యా సంవత్సరం సిద్ధిపేటలో బీ ఫార్మసీ కళాశాల
నేడు భవన నిర్మాణ పనులకు భూమి పూజ
సిద్ధిపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు
కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండల పరిధిలోని 10 గ్రామాలలోని కుల సంఘ భవనాలకు మంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల సంఘ ఆత్మ గౌరవ భవనాలకు టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు పోత్రాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల సంఘాలలో నిరుపేదలకు సంఘ భవనాలు శుభకార్యాలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్‌లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు చిన్నకోడూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు 10 లక్షల రూపాయలు, ఇబ్రహీంనగర్ బేడబుడగ హాల్‌కు 7 లక్షలు, కమ్మర్లపల్లి వడ్డెర హాల్‌కు 3 లక్షలు, మైలారం మున్నూరు కాపు భవనానికి రూ.5 లక్షలు, కొడెంగలకుంటలో రూ.10 లక్షలు, రజక భవనానికి రూ.10 లక్షలు, ముదిరాజ్ సంఘ భవనానికి రూ.10 లక్షలు, పెద్దకోడూర్ రెడ్డి భవనానికి రూ.5 లక్షలు, రామంచ రజక రూ.5 లక్షలు, మహిళా మండలి రూ.10 లక్షలు, రామునిపట్ల అంబేద్కర్ భవన్ రూ.6 లక్షలు, శంకరాయకుంట బీసీ కమ్యూనిటీ హాల్ రూ.8 లక్షలు, విఠలాపూర్ రెడ్డి రూ.10 లక్షలు, వెజిటబుల్ మార్కెట్ రూ.10 లక్షలు, పల్లె ప్రకృతి వనం రూ.10 లక్షలు, ఎల్లాయపల్లి గ్రామ పంచాయతీ భవనం రూ.5 లక్షలు చొప్పున మొత్తం చిన్నకోడూర్ మండలంలోని 10 గ్రామాలకు రూ.124 లక్షలు నిధులు మంజూరు చేసి ఆయా కుల సంఘ భవనాల ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘ ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అహార్నిశలు కృషి చేస్తున్నాడని, కుల సంఘ భవనిర్మాణాలకు మంత్రి హరీష్‌రావు చేస్తున్న సేవలు మరువలేవని మండల పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. అలాగే నంగునూరు మండలం రాంపూర్ గ్రామ వడ్డెరలకు ఇళ్ల స్థలాలు ధృవీకరణ పత్రాలు అందజేశారు.
వచ్చే విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కళాశాల ప్రారంభం ..
సిద్ధిపేటలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీ ఫార్మసీ కళాశాల ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎన్జీవో కాలనీ మునిసిపల్ కౌన్సిలర్ వరాల సురేష్-కవిత వార్డులో మంత్రి హరీష్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్‌లో అబ్దుల్ రబ్ ఆరీఫ్ మెడికల్ కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలో నీట్ విద్యార్థులకు జరిగిన ఏక్స్‌పర్ట్ గైడెన్స్ క్యాంపు కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కళాశాల ప్రారంభం కాబోతున్నదని, నేడ(సోమవారం) బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు పెరిగాయని, 70 ఏండ్లలో 800 సీట్లు ఉండేవనీ, కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో 2840 సీట్లు వచ్చాయని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో 50 సీట్లు వచ్చాయని తెలిపారు. సిద్ధిపేటలోని ఓ ప్రయివేటు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రెండు ఉన్నాయని, ఇక్కడే ఎంబిబిఎస్ చదువుకోవచ్చన్నారు. పట్టుదలతో చదవాలని, మైనారిటీలకు అనుకూలంగా సీట్లు లభిస్తాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
హనుమాన్‌నగర్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని హనుమాన్‌నగర్ మునిసిపల్ కౌన్సిలర్ నాయిని చంద్రం వార్డులో మంత్రి హరీష్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. పుష్పాలను పూజించే, ప్రకృతిని ప్రేమించే పండుగ. బతుకమ్మ పండుగ అని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చెప్పారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ సిద్ధిపేటలో బాగా జరుపుకునే మహిళల పండుగగా వివరించారు. మీరంతా ఆరోగ్యంగా ఉంటే చాలని, ఇందు కోసం మీ ఇళ్లు పరిశుభ్రంగా నిలపాలని, మిత ఆహారం తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ఆరోగ్య సిద్ధిపేటలో భాగంగా తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలను మంత్రి హరీష్‌రావు కోరారు.




