కంఠాన్ని కఠినమైన ప్రశ్నలు నలిమేస్తున్నాయి.
కాలం బుసకొట్టే నాగుపాములై దూసుకొస్తుంది.
మోసం చాటున నక్కిన నయవంఛకుల
చేతిలోపడి కష్టం కన్నీటివానై కురుస్తుంది.
స్వేదపుచుక్కల సాక్షిగా మనిషిశిఖరం కూలిపోతుంది.

నేలను చదునుచెయ్యడం నేర్చినవాడిని.
మొక్కలకు పానం పోసి పెంచడం ఎరిగినవాడిని.
భూమిని నమ్ముకొని బువ్వపూలు పూయించేవాడిని.
తెల్లని బంగారాన్ని పందించేవాడిని
పసుపుపచ్చని పసిడికొమ్ములతో తొలిబోనమై
పొశవ్వకు పసుపుకుంకుమలు సమర్పించేవాడిని.
మాగాణి సాలన్నీ పచ్చని రామచిలుకల్లా చేసేవాడిని
కాలుతున్న కడుపులో నాలుగు మెతుకులైనిండి
ఆకలి మంటలు తీర్చేవాడిని.

ఎవు’’సాయం’’ కాకపోయినా
వ్యవసాయాన్ని నమ్ముకొని నలుగుతున్నాను.
పోలంగట్లకాడ కన్నీటిని కార్చి…
కాలాన్ని నమ్ముకొని కదులుతాను.
కాలం కన్నెర్రజేస్తది.
ప్రళయతాండవం చేస్తది.
నోటికాడ కూడును నేలపాలుజేస్తది.
నేనంటే కాలానికి ఎదుకో పట్టలేనికోపం..!!
నేనెదుగుతుంటే చూడలేదు…ఓర్వలేదు.
గాలివానై వచ్చి మానని గాయాన్ని మిగుల్చుతుంది.
ప్రకృతే కనికరించడం లేదు.
మరి సాటిమనిషి ఎలా సహకరిస్తాడు..!
– అశోక్‌ ‌గోనె, 9441317361

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *