కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారాన్ని నివారించలేమా ?

ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల ఫీజులు విద్యార్థుల తల్లిద ండ్రులకు భారంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచేస్తుండటంతో తల్లిదండ్రులకు ఇది తలకు మించిన భారమవుతోంది. ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఫీజుల దోపిడీ సాగుతోంది. అధిక ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న, ధరల స్థిరీకరణ మాట మరచిన ప్రభుత్వంతో    ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఫీజుల దోపిడీతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్‌ ‌బాగుండాలన్న తపనతో ఆర్థికంగా కష్టాలు పడుతున్నా తల్లిదండ్రులు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌స్కూళ్లలోనే పిల్లలను చదివిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మేనేజ్మెంట్లు విద్యా వ్యాపారాన్ని యధేచ్చగా సాగిస్తున్నాయి.  ప్రభుత్వ అసమర్థత, అవినీతి అధికారుల అండదండలతో విద్యా వ్యాపారానికి దేశంలోనే  ఆంధ్ర  తెలంగాణ ప్రాంతాలు  అనుకూలమైనదిగా మారిందనే భావన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు  అనేక జీవోలు జారీ చేసిన వీరి ఆగడాలు ఆగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తమ ఆధిపత్యానికి ఎలాంటి సమస్య లేకుండా పాలకులను, అధికారులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మేనేజ్మెంట్లు సక్సెస్‌ అవుతున్నాయి. తల్లిదండ్రులు మాత్రం ఎప్పటిలాగే  కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల మోసపూరిత ప్రకటనలతో తమ తాహతుకు మించి ఫీజులు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్నారు.  రాష్ట్రంలో ఇంటర్‌ ‌విద్య అంటే నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు మాత్రమే అనే స్థాయిలో ఆ సంస్థలు చేస్తున్న ప్రకటనలతో తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. వీటికి మరికొన్ని ఇతర కార్పొరేట్‌ ‌విద్యా సంస్థలు జత కలిసి ఇంటర్‌ అం‌టే ఎంపీసీ, బైపీసీ మాత్రమే అనే స్థాయికి పరిస్థితిని తెచ్చాయంటే ఈ కార్పొరేట్‌ ‌మేనేజ్మెంట్లు ఎంతగా వేళ్లూనుకుపోయాయో అర్థమవుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకే పేరుతో వందల కాలేజీలు నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప  ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించి అపార్ట్మెంట్లలో కోచింగ్‌ ‌సెంటర్ల పేరుతో ఇంటర్‌ ‌క్లాసులు నడిపిస్తున్న కాలేజీలు హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. అయినా వీటిపై ప్రభుత్వం, అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్రవ్యాప్తంగా పీఆర్వో వ్యవస్థ ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులను మభ్య పెడుతూ టెన్త్ ‌పూర్తి కాకముందే లేని పోటీని సృష్టిస్తున్నాయి. ఇంటర్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌తో సంబంధం లేకుండా ముందస్తుగా ఇంటర్‌ ‌ఫస్టియర్‌ అడ్మిషన్స్ ‌మొత్తం నిర్వహించే స్థాయిలో కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల ధనదాహం కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో  నిబంధనలకు విరుద్దంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌విద్య సంస్థల పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల డిమాండ్‌ ‌ని పట్టించుకునే వారే కరువయ్యారు.  తల్లితండ్రులు  తాహతు మించి  అప్పో సప్పో చేసి కార్పొరేటు ఉచ్చులో  చిక్కుకుంటున్నారు. పరీక్షలకు  రెండు నెలలు ముందు నుండి  కార్పొరేట్‌ ‌కళాశాలలు, ప్రైవేటు  విశ్వవిద్యాలయాలు టీవీ, రేడియో  ఎలక్ట్రానిక్‌ ‌మాధ్యమాల ద్వారా  అడ్వర్టైజ్మెంట్లు  కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  ప్రభుత్వ కామన్‌ ఎం‌ట్రెన్స్ ‌టెస్టులు  పెట్టినట్లు  ప్రభుత్వమే  ఈ  కళాశాలలకు ప్రైవేటు  విశ్వవిద్యాలయాలకు, డీమ్డ్ ‌యూనివర్సిటీలకు అర్హత పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు  చేపడితే కొంతమేరకు  ఈ ఆగడాలకు  కళ్లెం వేయగలం. ఎవరికి తోచినట్లు వారు  నిబంధనలు నియమించుకొని, రిజర్వేషన్లు  పాటించక ఎన్ని కోర్సులు ఉన్నది  ఎన్ని  సెక్షన్లు ఉన్నది, ప్రతి సెక్షన్లకు ఎంత మంది విద్యార్థులను చేర్చుకుంటున్నది సమాచారం  ఉండదు. అక్షయ పాత్ర లాగా ఎంత మంది విద్యార్థులు ఎప్పుడు వచ్చిన చేర్చుకుని  సీటు  ఇస్తుంటారు. ప్రవేశ పరీక్ష రాసిన, రాయకపోయినా, విద్యార్ధి బదులు  వేరే వారు  పరీక్ష వ్రాసిన పట్టించుకునేవారు లేరు.  బెంగళూరు లో  సీటు కావాలంటే  అనంతపురం  రిమోట్‌ ‌సెంటరులో పరీక్ష నిర్వహిస్తారు. పిల్లల మనస్తత్వాన్ని  బలహీనత ఆసరా చేసుకొని  యథేచ్ఛగా అన్ని ప్రధాన  నగరాలలో కార్యాలయాలు తెరిచి  అందినకాడికి దోచుకుంటున్నారు.  ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే అడ్మిషన్లు ప్రారంభం అంటూ పెద్ద పెద్ద హార్డింగ్స్, ‌ప్రచార రథాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ ఇప్పుడు అడ్మిషన్‌ ‌తీసుకుంటే ఆఫర్‌ అం‌టూ మాయ మాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో లేని వసతులు, హాస్టల్స్లో సరైన మౌలిక సౌకర్యాలు కూడా లేకున్నా అన్ని ఉంటాయని మభ్యపెడుతూన్నారు. సంవత్సరాలు తరబడి  అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ వచ్చే  విద్య సంవత్సరానికి  శాశ్విత  భవనాలు నిర్మిస్తామని దశాబ్దం గడుస్తున్నా విద్య అధికారులు పట్టించుకోవడం లేదు.   ముందస్తు అడ్మిషన్ల కోసం ఇంటికి వచ్చే పీఆర్వో లను విద్యార్థుల తల్లిదండ్రులు తరిమికొట్టాల, అలాగే  ముందస్తు అడ్మిషన్లకు వత్తాసు పలుకుతున్న  ప్రభుత్వ అధికారులపై  చర్యలు చేపట్టాలి.  అడ్మిషన్లు ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్‌ ‌ని నియంత్రించాలి.  ప్రభుత్వ కాలేజీలో  సీట్ల భర్తీ ప్రక్రియ  అయిన తరువాత  ప్రైవేటు విశ్వవిద్యాలయాల అడ్మిషన్లు  జరపాలి.   ముందస్తు ప్రచారాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను అడ్డుకొని  చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కాలేజీలకు  అఫిలియేషన్‌  ‌రద్దు చేయాలి. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్‌ ‌వెలువడింది. ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌లో రిజిస్టర్‌ ‌చేసుకోవాల్సి ఉంటుంది.    ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటా ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని పోర్టల్‌ ‌ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటినుంచి కిలోమీటరు దూరంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు మొదట ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలోని వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఏడాదికి గ్రామాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆర్థిక బలహీనవర్గాలకు 6% సీట్లను కేటాయిస్తారు. ఆయా రిజర్వేషన్లలో విద్యార్థులు లేకపోతే వాటిని ఇతరులకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో మొదట ఎస్టీ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. సీట్లు కేటాయించిన వారం రోజుల్లో పిల్లలు పాఠశాలలో చేరిందీ లేనిదీ యాజమాన్యం నిర్ధారించకపోతే దాన్ని వివాదాస్పద సీటుగా పరిగణిస్తారు. దీన్ని జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీకి సిఫార్సుచేస్తారు. జిల్లా కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించొచ్చు. పాఠశాలకు వ్యతిరేకంగా ఏదైనా వివాదాన్ని జిల్లా కమిటీ గుర్తిస్తే సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంటుంది.
విద్యార్థుల భవిష్యత్‌ ‌కు మొదటి ప్రాధాన్యతనిస్తూ విద్యావేత్తలు, మేధావులు, విద్యారంగంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న వారితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలతో ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రకటనలతో విద్యార్థులకు నష్టం చేకూరుస్తోంది. ఇకనైనా ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. అందరికి ఒకే రకమైన ఫీజు నిర్ణయించి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లుగా నిర్ణిత ఫీజు నిర్ణయించి సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి, అన్ని రకాల వసతులతో ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దాలి. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య అందుతుంది. ఈ దిశగా అడుగులు వేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే.  పెరుగుతున్న ఫీజుల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మూడేళ్ల క్రితం కరోనా సమయంలో అంటే.. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో మాత్రం పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో చాలా వరకు విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విధానాన్ని ఫాలో అయ్యాయి. పైగా ఆన్‌లైన్‌ ‌క్లాసులు జరగడం వల్ల మెయింటెనెన్స్ ‌భారం తగ్గడంతో, చాలా వరకు స్కూల్స్ ‌పాత ఫీజుల్నే తీసుకున్నాయి. అయితే, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఆదేశాలు లేవు. దీంతో విద్యా సంస్థలు మళ్లీ ఫీజులు పెంచుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో భారీగా ఫీజులు పెంచిన యాజమాన్యాలు, ఈసారి మరింత ఫీజులు పెంచేందుకు రెడీ అవుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ఫీజులకు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులకు చాలా స్కూల్స్ ‌వివరాలు అందించాయి. మిగతా స్కూల్స్ ‌కూడా ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజుల విధానాన్ని ప్రకటించబోతున్నాయి. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు స్కూల్‌ ‌యాజమాన్యాల్ని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. తాము సిబ్బందికి ప్రతి సంవత్సరం వేతనాలు పెంచాలని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందువల్లే ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, పెరిగిన ఫీజులకు అనుగుణంగా సిబ్బందికి మాత్రం వేతనాలు పెంచడం లేదు. వారికి స్వల్పంగానే పెంచి, అధిక మొత్తంలో యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయి.
ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల దోపిడీ గురించి ప్రభుత్వానికి నిత్యం వినతులు వస్తూనే ఉన్నాయి. ఫీజుల్ని నియంత్రించాలని, అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ ‌చేస్తుంటాయి.
ఇలాంటప్పుడు ప్రభుత్వాలు నామమాత్రంగా స్పందిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఫీజుల నియంత్రణపై 2017 డిసెంబర్‌లో ఆచార్య తిరుపతి రావు కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ కమిటీ సిఫారసులను పరిశీలిస్తున్నామని మాత్రమే ప్రభుత్వం చెబుతూ వస్తోంది.మరోవైపు స్కూల్‌ ‌ఫీజుల రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురావాలని గత ఏడాది జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం తయారు చేసేందుకు 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ప్రకారం ప్రతి విద్యా సంవత్సరం పాత ఫీజులకంటే పది శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదని ప్రధానంగా సూచించింది. అలాగే విద్యా సంస్థల్ని నియంత్రించేలా ఇతర సూచనల్ని కూడా చేసింది. ఈ కమిటీ సూచనలు అమల్లోకి రావాలంటే దీనిపై సమగ్ర బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అది ఆమోదం పొంది, అమల్లోకి రావాలి. కమిటీ నివేదిక వచ్చి ఏడాదవుతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పట్లో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. అలాగని ఆర్డినెన్స్ ‌జారీ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణా లేకపోవడంతో విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల్ని భారీగా పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి.
image.png
డా. ముచ్చుకోట సురేష్‌ ‌బాబు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాసైన్స్ ‌వేదిక
9989988912

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *