ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు. 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది..కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీకశుద్ధ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ ఏకాశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు ఉపవాసముండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే శ్రేయస్కరమని నమ్మకం.
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్నరోజు కార్తీక పౌర్ణమి. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఇంటిల్లిపాది ఉపవాసాలుండి శివుని ధ్యానిస్తారు.. ఈ దినాన ప్రతి ఇంట కేదారేశ్వరునికి మర్రి ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తుల నమ్మకం. పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. కార్తీక పౌర్ణమిన చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం… కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఆ రోజు ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.
కార్తీక దీపాలు
తమ కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు పౌర్ణమిరోజు వేకువన గ్రామాల్లో అరటి దొప్పలతో కార్తీక దీపాలు వెలిగించి చెరువులు, నదుల్లో వదులుతారు. నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నివసించిన అది గురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, ఆచరించే విధానం ఋషులకు బోధించాడని ప్రతీక. కార్తీక పౌర్ణమి రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలో తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇస్తారు. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ పూర్తి చేయాలని చెబుతారు.
సోమవారాలు – నదీస్నానాలు
కార్తీకమాసం నదీస్నానం అత్యంత ప్రధానమని భక్తుల విశ్వాసం. సూర్యభగవానుడు కార్తీకమాసం వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం మంచిదని ఋషులు పేర్కొన్నారు. మానసిక దేహారోగ్యానికి ఏర్పడే ఇబ్బందిని నివారించడానికి కార్తీక మాసం ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించడమనే అనవాయితీ కొనసాగుతోంది. కార్తీకమాసంలో శీతల స్నానమాచరించడం ఆరోగ్యానికి మంచిదని. అలాగే ఈ నెలరోజులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పేర్కొంటారు. ఈ నెల సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన వారికి మహత్తరశక్తి కలుగుతుందని విశ్వాసం.
కార్తీక పౌర్ణమిన నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని, కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి, పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీక. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడంతో దారిద్యం తొలగిపోతుందని మరో నమ్మకం. కార్తీక పౌర్ణమిన లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని, ఆ రోజున చేసే దీపారాధన వలన శివుని అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్ : 98481 28215




