గుంటూరు,మార్చి4 : పల్నాడు జిల్లా లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్ రాజ్యమ్మ,పాస్టర్ నాగినేని సురేశ్ మృతి చెందారు.సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా జరుగగానే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సత్తెనపల్లి మండలం నందిగామ పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం సపంలో ఉపాధ్యాయురాలు, ఆమె మేనల్లుడు కలిసి కారులో సత్తెనపల్లి నుండి కొమెరపూడికి వెళుతుండగా, రామకృష్ణాపురం సపంలో కంకర లోడుతో గుంటూరు వైపు నుండి సత్తెనపల్లికి వస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు, ఆమె మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సత్తెనపల్లికి చెందిన నాగినేని రాజ్యమ్మ (55), మేనల్లుడు నాగినేని సురేష్ (35) లుగా గుర్తించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



