కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి
స్పష్టత సున్నంలా రాలిపోయింది
అవగాహన పెచ్చులూడిపోయింది
నలుగురు అరిస్తే నాలుక తడబడింది
చదువు వివేకం కొయ్యబారిపోయాయి
విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో
ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది
మొహం ఓడిపోయినట్టు నీరుగారింది
దేహం కుంచించుకుపోయింది
గొంతు పడిపోయింది
వణుకుతూ అగాధంలో
ఊపిరికి గాలి అందట్లేదు
కళ్ళు లోపలికి చూస్తూ
కన్నీళ్ళను మింగుతున్నాయి
బద్దలుగొట్టాలి ఈ గోడలను
లోపలే పేరుకుపోయి
నన్ను సమాధి చేస్తున్నవి
మహావ్యాకోచం గాంచాలె నాకు నేనుగా
నా నుంచి శకలాలు శిథిలాలు
విసిరేయబడి విశాల విశ్వంలో
స్వేచ్ఛా నక్షత్రమై పరిణమిల్లాలి
నేలపై తిరుగాడుతూ
వెలుగులు చిమ్మాలి
జాగృతం చేయాలి నాలా
దగాపడిన నా ప్రజలను
వాళ్ళల్లోని అన్ని గోడలనూ
కాంతిపుంజాలతో రాల్చి
జ్ఞానోదయపు దివ్వెలుగా మలచాలి
అందుకు సముద్రమంత సాధన చెయ్యాలి!

– రఘు వగ్గు 9603245215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *