హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ..191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచారని,, ఒడిశా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటల్‌కు రూ. 3100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
వీరిని చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4వేలు, దివ్యాంగులకు 6వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 శాతం మాత్రమే పండిరచే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీల అమలు చేయాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.





