కాంగ్రెస్‌ ‌సంక్షోభం టీ కప్పులో తుఫానేనా?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు టీ కప్పులో తుఫానే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దిల్లీ  రాజా (డిగ్గీ రాజా) హైదరాబాద్‌ ‌రావడంతోనే సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో బలహీన పడుతుండడంతో కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో వోటు  బ్యాంకు ఉంది. సమర్థులైన నాయకులనేకమంది కష్టపడి పనిచేసేవారున్నారు. అయితే అనైక్యత కారణంగానే ఆ పార్టీ అపజయాలను చవిచూడాల్సి వొస్తున్నది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్‌దే ప్రధాన భూమిక. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే, ఏపి నుండి వ్యతిరేక వొస్తుందని తెలిసినప్పటికీ రాష్ట్రాన్ని విభజించింది. అయితే ఏపి సంగతి ఎలా ఉన్నా తెలంగాణలోకూడా ఆ పార్టీకి ఇప్పుడు మనుగడ లేకుండా పోయింది. ఫలితంగా ఎనమిదిన్నర సంవత్సరాలుగా అధికారానికి దూరమైంది. ఇప్పుడు మరో ఏడాది కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్‌కు నిత్యం అంతర్గత కుమ్ములాటలతోనే సరిపోతున్నది. గతంలో ఎన్నడూ, ఏ పార్టీలో లేని విధంగా సీనియర్లు, జూనియర్లని, వలసనేతలని పార్టీలో విభేదాలు  మొదలయ్యాయి. పార్టీలు మారకుండా మొదటినుండీ కాంగ్రెస్‌ను పట్టుకుని వేళ్ళాడుతున్న నాయకులు కొందరు ఆ పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడిపైన ధ్వజమెత్తడం ప్రారంభించారు. కారణం.. ఇతర పార్టీనుండి వొచ్చిన వ్యక్తి తమ బాస్‌ ‌కావడాన్ని వారు ఏమాత్రం సహించలేకపోయారు. ఆ పార్టీ అధిష్టానం కూడా టిడిపి నుండి వొచ్చిన రేవంత్‌రెడ్డిని టిపిసీసీ అధ్యక్షుడిగా నిలబెట్టింది. అనాటినుండి తెలంగాణరాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం బయలుదేరింది. కొందరు బహిర్గతంగా విమర్శిస్తే, మరి కొందరు అన్యమనస్కంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం పాటిస్తూ వొచ్చారు. మరికొందరు సీనియర్లు  అప్పటికే పార్టీ విడిచి పోయారు. పోతూపోతూ నిన్నటివరకు తమకు వివిధ పదవులిచ్చి గౌరవించిన పార్టీపైన కాస్తా బురదచల్లి మరీ పోయారు. తాజగా మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీ అధ్యక్షుడిపైన బాహాటంగానే ధ్వజమెత్తారు. ఒక విధంగా వీరంతా పార్టీనుండి బయటికి పోతారా అన్నంతగా మీడియా సాక్షిగా దాడిచేశారు.

ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరు నుండి ఎనిమిది మంది సీనియర్‌ ‌నేతలు స్థానిక నాయకత్వంపైన విరుచుకుపడడం పెద్ద సంక్షోభానికి దారితీసింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చాలామంది సీనియర్లను కోల్పోయిన టీపీసీసీ మరోసారి ఇంతపెద్ద సంఖ్యలో కోల్పోయే పరిస్థితులు ఏర్పడడంతో ఆ పార్టీ హైకమాండ్‌ అలర్ట్ అయింది. మొదటి సమావేశంలోనే మీడియాముఖంగా స్వీయ పార్టీపైన తీవ్ర విమర్శలు చేసిన సీనియర్లు రెండవ దఫా సమావేశం అయి భవిష్యత్‌ ‌నిర్ణయాన్ని తీసుకునేందుకు సన్నద్దం అవుతున్న దశలో పార్టీ హైకమాండ్‌ ‌జోక్యం చేసుకుని తాత్కాలికంగానైతే సమావేశం ఏర్పాటుచేయకుండా వారించగలిగింది. సీనియర్ల అసహనానికి కారణాలను తెలుసుకోవాల్సిందిగా సీనియర్‌ ‌నాయకుడు, గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా వ్యవహరించిన దిగ్విజయ్‌ ‌సింగ్‌ను ఏఐసీసీ ఆదేశించింది. బుధవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుని, గురువారం అసమ్మతితో ఉన్న సీనియర్‌ ‌నేతలతో ఆయన చర్చలు జరిపి పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారిస్తాడనుకుంటున్నారు. గతంలో ఇక్కడి వ్యవహారాలను చూసినవాడు కావటంవల్ల సీనియర్లందరితో ఆయనకు వ్యక్తిగత పరిచయాలకారణంగా దాపరికంలేకుండా సీనియర్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని, అలాగే ఆయనకూడా వారిని శాంతింపజేస్తారన్న నమ్మకాన్ని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ ‌రావడానికి ముందే దిల్లీలో  ఆయన రేవంత్‌రెడ్డితో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చిండంవల్ల ఇప్పటికే ఒక అవగాహనకు వొచ్చి ఉంటాడనుకుంటున్నారు. ఇదిలా ఉంటే  మొదటినుండీ  పిసీసీ  అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు అదే పట్టుదలతో ఉంటే, రేవంత్‌రెడ్డిని ఆ స్థానంనుండి తొలగించి సీనియర్‌లలో ఎవరికైనా అ పదవిని అప్పగిస్తారా అన్న చర్చకూడా జరుగుతున్నది.

ఈ విషయంలో మొదటినుండీ  కోమటిరెడ్డి బ్రదర్స్ ‌తమ ఇద్దరిలో ఎవరికి  పిసీసీ  పదవి ఇచ్చినా పార్టీని పూర్వస్థాయికి తీసుకువస్తామని గతంలో అనేకసార్లు పేర్కొన్నవిషయం తెలియందికాదు. ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంకా ఆశలోతోనే ఉన్నాడు.  మరికొందరు నేతలుకూడా  బహాటంగా చెప్పకున్నా అదే అభిప్రాయాన్ని తమ మాటల్లో వ్యక్తం చేస్తూ వొస్తున్నారు.  మరో ఏడాది కాలంలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అనుకోకుండా ముందస్తు ఎన్నికలు కూడా రావొచ్చనుకుంటున్నారు. ఈ దశలో పీసీసీ ప్రెసిడెంటును  మారుస్తారా అన్న అనుమానం లేకపోలేదు. రేవంత్‌రెడ్డికి సోనియా, రాహుల్‌గాంధీల ఆశీస్సులు బలంగా ఉండడంవల్లకూడా ఆయన్ను ఎన్నికలవరకు మార్చకపోవొచ్చన్న వాదనకూడా ఉంది. ఒకవేళ మార్చడమే జరిగితే రేవంత్‌ ‌పరిస్థితేమిటి, పార్టీలో ఉంటాడా, సొంతంగా  మరో పార్టీ పెడుతాడా? లేక చంద్రబాబుకు సన్నిహితుడు కావడంవల్ల ఇప్పుడు తెలంగాణలో టిడిపి పునర్జీవం పోసుకుంటున్న తరుణంలో మళ్ళీ మాతృ సంస్థలోకి వెళతాడా అప్పుడు ఆయనతోపాటు టిడిపినుండి వొచ్చినవారంతా ఏకమవుతే కాంగ్రెస్‌ ‌పరిస్థితి ఏమిటన్నదికూడా పెద్ద ప్రశ్నగా మారే  అవకాశముంది.  కాగా అసమ్మతి నేతలు రెండవ విడుత సమావేశాన్ని దిగ్విజయసింగ్‌ ‌ఫోన్‌కాల్‌తో ఆపేశారంటే కొంత మెత్తపడ్డారనే చెప్పాలె. వీరంతా గురువారం దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశం అయిన తర్వాత తమ దూకుడుకు కళ్లెం వేసుకునే అవకాశాలు లేకపోలేదన్న చర్చకూడా జరుగుతున్నది. వాళ్ళు నినాదంగా చేపట్టిన సేవ్‌ ‌కాంగ్రెస్‌  ‌వారిని మెప్పించే ప్రాతిపదిక అయ్యే అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతున్నది. అదే అయితే తాజా సంక్షోభం టి కప్పులో తుఫానే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *