- రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి
- బంగారు తెలంగాణ కెసిఆర్‌కే సాధ్యం
- జహీరాబాద్ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండని, కాంగ్రెస్‌ను•, భారతీయ జనతా పార్టీ కల్లబొల్లి మాటలు రమ్మి మోసపోకండని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 175 కోట్ల వ్యయంతో పలు నిర్మాణ పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 2 బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలు, మైనారిటీ బంధు, బిసి బంధు, కల్యాణ లక్ష్మి, శాది ముబారక్ చెక్కులను మరియు కుట్టు మెషీన్ లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అనేక సమస్యలున్నయని, నడ్డా తెలంగాణలో హంగ్ వొస్తుందని అన్నాడు కానీ ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ జాక్ పెట్టినా పైకి లేచే పరిస్థితిలో లేదని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీట్ గెలిచింది కానీ ఈ సారి డకౌట్ కావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ స్థితి వెస్ట్ఇండీస్ క్రికెట్ జట్టు పరిస్థితిలా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయో పాలించే కాంగ్రెస్, బిజెపిలు తేల్చి చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అనేక సంక్షేమ పథకాలు పేదల దరికి చేర్చుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ సాధించేలా ప్రజలందరూ బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. ప్రతి కుటుంబానికి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తుందని, వారి బూటకపు మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజలకు షాదీ, ముబారక్, కల్యాణ లక్ష్మి, రైతు బీమా రైతుబంధు దళిత బంధు, బీసీబంధు, మైనార్టీ బంధు వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ఎంపీ బీబీ పాటిల్ జెడ్పి చైర్ పర్సన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ భారీ పరిశ్రమల డెవలప్మెంట్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఆయా మండలాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.





