కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి

*12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు ఎక్కడ..!
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ముస్లిం మైనార్టీలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమనగల్లు మహమ్మదీయ మసీద్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ మైనుద్దీన్, అబ్దుల్ ఖాదర్, ఖలీల్, రహీంలు అన్నారు. ఆదివారం ఇక్కడ వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బందును అర్హులైన ముస్లింలకు ఇవ్వకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిందని వారు ఆరోపించారు. ప్రతి విషయంలో మైనార్టీలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని వారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదేనన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ముస్లింల కోసం కట్టించిన షాదీఖానా 20 సంవత్సరాలుగా అసంపూర్తిగానే ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దాని విషయంలో ఎందుకు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కేవలం పత్రికల ప్రకటనల వరకే మాట్లాడుతున్నారే తప్ప ఆచరణలో అమలు జరగడం లేదన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల జనాభా అధికంగా ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల మంజూరు చేయలేదని వారన్నారు. గతంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై చిన్నచిన్న డబ్బాలు వేసుకొని సైకిల్ షాపు, వెల్డింగ్, రెగ్జిన్ ఫోన్ సర్వీస్ సెంటర్, షాపులు పెట్టుకొని కుటుంబాలను పోషించుకునే వారని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చాలామంది ముస్లిం కుటుంబాలు రోడ్డున పడ్డాయనీ అన్నారు. వారికోసం నిర్మిస్తామన్న షాపింగ్ కాంప్లెక్స్ హామీ ఏమైంది అన్నారు. వారందరికీ మైనార్టీ బందు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్ ఖాద్రి, షర్ఫుద్దీన్, మజీద్ ఖురేషి, బాబా, నిరంజన్, తయ్యబ్, గౌస్, అలీమ్, ఫరీద్, నాసర్, జహంగీర్, సలీం, కరీం, బాబా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *