11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచారు
1200 మంది ప్రాణాలు బలిగొని రాష్ట్రాన్ని ఇచ్చారు
దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం
కారుకు ఓటు ప్రగతికి బాట
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో
ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు, కార్యకర్తలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 20:11 సార్లు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచి అంధకారంగా మార్చారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జిన్నారం మండల పరిధిలోని జగంపేట, పెద్దమ్మ గూడెం, జిన్నారం, ఊట్ల, సోలక్ పల్లి, రాళ్ల కత్వా, శివనగర్, ఇమామ్ నగర్, మంగంపేట తుల్లగూడెం గ్రామాల పరిధిలో నిర్వహించిన రోడ్ షో లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళహారతులు, డప్పు చప్పులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్ది కాలంలో తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. ప్రధానంగా వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
జిన్నారం మండల పరిధిలోని ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయలతో పాటు సిఎస్ఆర్, సొంత నిధులతో రహదారులు గుడులు బడులు మసీదులు నిర్మించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించామని తెలిపారు. 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.ఆరు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి వలన కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే తిరిగి 60 ఏళ్ల వెనుకబాటుకు గురవుతామని తెలిపారు.ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని, కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే బిఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పార్టీ అధ్యక్షులు రాజేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





