కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారంలోకి రావాలని ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ ఓటములనే చవిచూస్తూ వొస్తున్నది. దానికి తగినట్లుగా స్వయం అపరాధాలను మూటగట్టుకుంటున్నదాపార్టీ. జాతీయ స్థాయి మొదలు, వివిధ రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరు పార్టీ వీడిపోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం ఆ పార్టీ భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న ఎదురవుతున్నది.దశాబ్ధాలుగా ఆ పార్టీకి లాయల్టీగా ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్నదన్న అపవాద ఉంది. గత ఎనిమిదేళ్ళుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఎన్నికల్లో ఒకటి రెండు మినహా దాదాపుగా అన్ని చోట్ల అపజయాలే పార్టీకి ఎదురవుతున్నాయి. దాంతోనైనా పార్టీని సన్మార్గంలో పెట్టాలన్న ఆలోచన చేయడంలేదన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలోనే సంవత్సరాల తరబడి తర్జనభర్జనకు లోనైన విషయం తెలియందికాదు.
ఇక తెలంగాణ విషయానికి వొస్తే… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండి నేటీ వరకు అంతర్గత
కలహాలతోనే కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైన తెలుగుదేశం పార్టీనుంచి వొచ్చిన వ్యక్తికి ఉన్నత పదవిని కట్టబెట్టడాన్ని ఆ పార్టీలోని సీనియర్ నేతలెవ్వరికీ ఇష్టంలేదు. ఆ విషయంలో అనేక సందర్భాల్లో వారు బాహాటంగానే రేవంత్‌రెడ్డిని విమర్శించిన విషయం తెలియంది కాదు. పార్టీలో అంతోఇంతో పేరున్న బడా నాయకులు చాలామంది ఇక తమకిక్కడ భవిష్యత్ లేదని మరో పార్టీ తీర్థం తీసుకున్న విషయం తెలియందికాదు. పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విధంగా యువకుల్లో ఉత్సాహం పెరిగినప్పటికీ, వివిధ జిల్లాల్లో వేళ్ళూనుకున్న సీనియర్లు మాత్రం ఆయనకు సహకరించక పోవడంతో పార్టీ వరుస ఓటములను చవిచూడాల్సి వొస్తున్నది. తాజాగా హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే అందుకు నిదర్శనం. మునుగోడులో పార్టీ అభ్యర్థికోసం పనిచేయాల్సిన ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన తమ్యుడిని గెలిపించాలని కార్యకర్తలతో చెప్పడం పెద్ద సంచలనంలేపింది. దానిపైన సమాధానం చెప్పాల్సిందిగా వెంకట్‌రెడ్డికి పార్టీ అధిష్టానం రెండు షోకాజ్ నోటీసులను అందజేసింది.
దానికి సమాధానం చెప్పానంటున్న వెంకట్‌రెడ్డి తాను ఏ పార్టీలో ఉండేది త్వరలోనే చెబుతానని మీడియా ముందు చెప్పడం చూస్తుంటే ఆయన పార్టీ వదిలి వెళ్తాడన్న సంకేతాన్నిచ్చినట్లైంది. ఇప్పటికే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవలనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిధర్‌రెడ్డి కూడా కాషాయ కండువ కప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. అంతకు ముందే విజయశాంతి, డికె అరుణ లాంటి ఫేస్ వాల్యూ ఉన్నవారనేకులు బిజెపిలో చేరిపోయారు. అయినా పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో మరికొందరు అసంతృప్తిలో మగ్గుతున్నారు. రాష్ట్ర శాసనసభకు మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే అంతకు ముందే రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితిలో అధికార బిఆర్‌ఎస్ (టిఆర్‌ఎస్), బిజెపిలు ఇప్పటికే ఎన్నికల వాతావర్ణాన్ని సృష్టిస్తున్నాయి. వీరితో సమానంగా పోటీ పడాల్సిన కాంగ్రెస్ మాత్రం అంతర్ఘత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నది.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తాజాగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అసలే విభేదాలతో కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇది మరింత చిచ్చులేపింది. ఈ కమిటి ఏర్పాటులో సీనియర్‌లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలామంది సీనియర్లు, పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలుగా పనిచేస్తుంటే కమిటీల్లో చోటు కల్పించకపోవడం ఒకటైతే, తమ కన్నా సీనియర్లకు ఉన్నత పదవులు కట్టబెట్టడంపట్ల ఆగ్రహా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకురాలు కొండా సురేఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, తనకు నూతనంగా కల్పించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి వెంటనే రాజీనామా చేసింది. అలాగే పిసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. మొదటినుండీ తెలంగాణకోసం పోరాడిన పి.
జనార్థన్‌రెడ్డి కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుగోబోతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఈ నెల 28న తన తండ్రి జనార్థన్‌రెడ్డి వర్థంతి రోజున ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకావం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సీనియర్లకు అన్యాయం జరిగిందంటారాయన. బలహీన వర్గాలకు కమిటీలో అన్యాయం జరిగిందంటున్న ఆయన అనర్హులకు పెద్దపీట వేశారని విమర్శిస్తున్నారు. అంతేకాదు కోవర్టులకు పదవులు కల్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు పార్టీ సీనియర్లు వి. హనుమంతరావు, గీతారెడ్డి, ప్రేమ్‌సాగర్, మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి లాంటి సీనియర్ నాయకులుకూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. అలాగే ఉద్యమంలో భాగస్వాములైన ఉస్మానియా విద్యార్థి నాయకులు పలువురు తమను గుర్తించలేదన్న అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విచిత్రమేమంటే రేవంత్‌రెడ్డి తర్వాత పార్టీ సారథిగా చెప్పుకుంటున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా అయోమయంలో పడ్డారు. కమిటీ నిర్మాణం చేసేప్పుడు పిసీసీతో పాటు సిఎల్పీ నేత అభిప్రాయాన్నికూడా తీసుకోవాల్పి ఉండగా, ఈ విషయంలో తనను అసలు సంప్రదించనే లేదని ఆయన వాపోతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు ఏ జిల్లానుండి ఎవరిని తీసుకుంటే బాగుంటుందన్న సమిష్టి అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏక పక్షంగా పార్టీ ప్రకటించడమంటే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యం అధిష్టానానికి లేదోమోనన్న అనుమానానికి తావేర్పడుతుందంటున్నారు నేతలు.




