- అధికార పార్టీకి అనుకూలంగా డీజీపీ• వ్యవహార శైలి…వెంటనే తొలగించాలి
- పోలీసుల తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన వి•డియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారని, తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పోలీసులను హెచ్చరిస్తున్నా..కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. బిడ్డా కేటీఆర్..గుర్తు పెట్టుకో…నీ అధికారం 45రోజులే….ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తామని రేవంత్ హెచ్చరించారు.
అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించాలని, బీఆర్ఎస్ కార్యకర్తల్లా కాదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారని, ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం తమదేనని, డిసెంబర్ 9వ తేదీన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని, ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని, కాంగ్రెస్ ఏం చేసిందంటూ బావ, బామ్మర్ధులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్ కాదా..? కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. వారు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని, సోనియమ్మ దయతోనే వారికి మంత్రి పదవులు దక్కాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హావి•లు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారన్నారు. 4 కోట్ల ప్రజలను మోసగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, అందుకే సెప్టెంబర్ 17వ తేదీన సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారన్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు రేవంత్ రెడ్డి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని, తనను భాగ్యలక్ష్మీ అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారని, భాగ్యలక్ష్మి ఆలయానికి వొచ్చేందుకు తాను సిద్ధమని, వారు సిద్ధంగా ఉన్నారా..అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.





