షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్18: షాద్నగర్ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్నగర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నాయకులు , కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, జెడ్పిటిసిలు పి వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మైనార్టీ నేత జమృత్ ఖాన్, క్రాంతి రెడ్డి, కొత్తూరు మాజీ సర్పంచ్ జే సుదర్శన్ గౌడ్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు తదితర అసమ్మతి నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లభించక తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వారి అదృష్టం మేరకే తాను పార్టీ మారుతున్నానని అన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని అన్నారు. ఇకనుంచి నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో పర్యటించి కాంగ్రెస్ పార్టీలో అందరిని చేర్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. త్వరలోనే తనతో పాటు దాదాపు 20,000 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి జెడ్పిటిసిలు పి వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మైనార్టీ నేత జమృత్ ఖాన్, క్రాంతి రెడ్డి, కొత్తూరు మాజీ సర్పంచ్ జే సుదర్శన్ గౌడ్ తదితరులకు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతాపన్న అభిమానులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం





