రెండేసి సీట్ల కేటాయింపు విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇంకా అభ్యర్ధుల ఎంపికపైనే ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న క్రమంలోనే తమతో పాటు తమ కుటుంబ సభ్యులకుకూడా స్థానం కేటాయించాలంటూ సీనియర్ నాయకులు చేస్తున్న ఒత్తిడి తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నది. ఈ విషయం అధిష్టానం చూసుకుంటుందని స్థానిక నాయకత్వం చేతులు దులుపుకునే ప్రయత్నిస్తుండగా, అధ్యక్షుడి హోదాలో అధిష్టానానికి సర్ది చేప్పాలని నిలదీతతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకుంటోంది. దీంతో అలకలు, సమావేశాలనుండి అర్ధాంతరంగా నిష్క్రమించడంలాంటి ఘటనలతో కాంగ్రెస్‌లో వేడి రాజుకుంటోంది.
కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వాల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో పోటీ చేయడానికి కాస్తా వెనుకాముందు ఆలోచించుకునే స్థాయినుండి ఒక్కో నియోజకవర్గానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడం విశేషం. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు గాను 1025 దరఖాస్తులు వొచ్చాయంటే కాంగ్రెస్ పట్ల నమ్మకం పెరిగిందనే అనుకోవాలి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోని చోటా, బడా నాయకుల్లో విశ్వాసం పెరిగింది.
తెలంగాణలో కూడా తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం ఆ పార్టీకి ఏర్పడిరది. దానికి తగినట్లుగా ఆ పార్టీ కేంద్రనా యకత్వం కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, స్థానిక నాయకత్వానికి తగిన సూచనలు, సలహాలను ఇస్తున్నది. దీంతో ఈసారి బి ఫారం సంపాదిస్తే గెలుపు ఖాయమన్న అభిప్రాయానికి నాయకులు వొచ్చారు. అందుకే ప్రతీ నియోజక వర్గంలోనూ పోటీ పెరిగింది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి రెండేసి నియోజకవర్గాలను కేటాయించాలన్న డిమాండ్ ముందుకు వొచ్చింది. మాజీ పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనతోపాటు తన భార్యకుకూడా టికట్టు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వాస్తవంగా వారిద్దరుకూడా గతంలో గెలిచిన స్థానాలనే కోరుతున్నారు. 2014లో హుజూర్ నగర్‌నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభ్యుడిగా గెలుపొందగా, కోదాడ నుండి ఆయన భార్య పద్మావతి గెలిచారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అదే స్థానం నుండి గెలిచినప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపిగా గెలుపొందారు. 2018లో కోదాడ నుండి ఓటమి చవిచూసిన పద్మావతి హుజుర్నగర్ ఉప ఎన్నికలో నిలబడి మరోసారి ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలను తిరిగి తమకే కేటాయించాలని ఉత్తమ్ డిమాండ్ చేయడం తోపాటు ఆ రెండు స్థానాలకు వారిద్దరు దరఖాస్తుకూడా చేసుకున్నారు. శాసనసభ అభ్యర్ధిత్వానికి చేసుకున్న దరఖాస్తు ్త లన్నిటిని స్క్రీనింగ్ చేసిన తర్వాత అధిష్టానానికి పంపిస్తామని, వారే రెండు సీట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చెప్పడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి ముందే తమ గురించి చెప్పాలని ఉత్తమ్ ఒత్తిడి చేయడంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహించడం, ఉత్తమ్ అక్కడినుండి నిష్క్రమించడం జరిగిపోయింది.
ఇదిలా ఉంటే ఉత్తమ్ లాగే రెండేసి నియోజకవర్గాలను అభ్యర్దిస్తున్న పలువురు నాయకులు ఆయా స్థానాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలు, ఆయనతో పాటే టిడిపినుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ములుగు శాసనసభ్యురాలు సీతక్క కూడా రెండు స్థానాలకు దరఖాస్తు చేసుకుంది. తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ కేటాయించాలంటోంది. అలాగే కరీంనగర్ స్థానానికి కెసిఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు తనతో పాటు తన కుమారుడికి టికెట్ కావాలంటోంది. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకుని, ఇటీవల పార్టీ మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా మూడు నియోజకవర్గాల గెలుపు బాధ్యత తనదేనని మూడిరటికీ దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఖమ్మంలోని పదకొండు స్థానాలను తానే గెలిపిస్తానని పొంగులేటి ప్రకటించిన విషయం తెలియందికాదు. అలాగే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి పదవిపై చాలా కాలంగా ఆశ పెట్టుకున్న కె. జానారెడ్డి ఈసారి తనకు బదులుగా తన కుమారులను బరిలోకి దింపుతున్నారు. ఆయన కుమారులు రఘువీర్, జై వీర్ల పక్షాన దరఖాస్తు చేశారు.
వీరంతా తమ కుటుంబ సభ్యులను తప్పకుండా గెలిపించుకుంటామనే చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని దృఢనిశ్చయంగా ఉంది. ఆమేరకు వొచ్చిన దరఖాస్త్తులను జల్లడ పడుతున్నది. గడచిన అయిదు రోజులుగా వడపోతలతో, పరిశీలకుల ఏకాభిప్రాయంతో ఎంపిక చేయబడిన సుమారు నలభై మంది అభ్యర్ధుల జాబితాను మొదటి విడుతగా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు కుస్తీ పడుతున్నది. అయితే ప్రతీ నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే స్క్రీనింగ్ కమిటీ ముందు మరికొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మహిళలకు ఎన్ని స్థానాలను కేటాయిస్తున్నారన్నది ఒకటికాగా, సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న బిసిల పరిస్థితి ఏంటన్న స్వీయ నాయకుల ప్రశ్నలను గమనంలోకి తీసుకుని జాబితాను తయారుచేసే పనలిలో పడిరది తెలంగాణ కాంగ్రెస్.




