కాంగ్రెస్‌కు అసంతృప్తి మిగిల్చిన ఫలితాలు

– హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాకు విజయావకాశాలు
– బీజేపీకి గతంకంటే తక్కువ వార్డులు, ఓట్లు
– స్థానిక ఎన్నికల్లో అధినేతలు తిరిగితే ప్రయోజనం శూన్యం
– మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్ళు ఆశించినన్ని స్థానాలు రాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీలో ఎన్ని గెలిచాడు.. ఇప్పుడు తాము ఎన్ని గెలిచాము.. ప్రజలు గమనిస్తునే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసిందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన శనివారం చిట్‌చాట్‌ మాట్లాడారు. తమ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని, 30 మున్సిపాలిటీలపైగా వస్తాయనుకున్నామని, కానీ వచ్చిన 17 కాక హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పారు. తమ పర్ఫార్మెన్స్ బాగుందని బీజేపీ ఎందుకు చెప్పుకుంటున్నదో అర్థం కావడం లేదని, వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని చెప్పారు. జాతీయ అధ్యక్షుడిని తెచ్చి హడావుడి చేసినా ఫలితాలు ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయించి బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే ప్రయోజనం ఏముండదని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో లోకల్ అంశాలతోపాటు ప్రభుత్వంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ తమ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని, పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారని చెప్పారు. కాగా, మరోసారి ఫార్ములా ఈ-రేస్ అనే అంశాన్ని ప్రభుత్వం తెరమీదికి తీసుకొస్తున్నదని, ఇప్పటికి నాలుగుసార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేవలం తమాషా కోసమే మరోసారి పిలవబోతున్నారన్న సమాచారం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా పోతాం.. ఉన్న సత్యం స్పష్టంగా చెబుతాము.. ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు.. చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదని స్ప‌ష్టం చేశారు.కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీలో ఎన్ని గెలిచాడు.. ఇప్పుడు తాము ఎన్ని గెలిచాము.. ప్రజలు ఇవన్నీ గమనిస్తునే ఉన్నారని కేటీఆర్ చెప్పారు.

మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని కేటీఆర్ అన్నారు. ఆంధప్రదేశ్‌లో ఫలితాలే దీనికి స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు.  స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులనుబట్టే పొత్తులు ఉంటాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదంటూ నిన్నటిదాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడామన్నారు.

బెల్లంపల్లిలో మరింత బలం .. బీఆర్‌ఎస్ లో చేరిన పలువురు కౌన్సిలర్లు

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలువురు కౌన్సిలర్లు బీఆరఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తోపాటు, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆరఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితోపాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి పార్టీలో అధికారికంగా చేరనప్పటికీ బీఆరఎస్ విధానాలకు ఆకర్షితులై పార్టీకి పూర్తిస్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ చేరికల వల్ల బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆరఎస్ మరింత బలోపేతం కానున్నదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *