- దేశ ప్రజలు గెలవాలంటే బిజెపికి వోటేయాలి
- ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా కుదురుతాయి
- భోపాల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య
భోపాల్, జూన్ 27 : బీఆర్‌ఎస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు వోటు వేయండి…దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి వోటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా సీఎం కేసీఆర్, ఎంఎల్సీ కవిత పేర్లు ప్రస్తావించి మరీ ఎటాక్ చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ, తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ మధ్య రాజీ కుదిరిందని, ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోవడం గమనించదగ్గ విషయం. మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాలని అర్థం వొచ్చేలా స్పష్టమైన వైఖరిని కనపరచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మొదటిసారి కేసీఆర్‌పై మోదీ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారని చర్చించుకుంటున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహించింది. మంగళవారం నిర్వహించిన పలు ఈవెంట్స్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదీ దేధం వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్చించారు. ఇదే సందర్భంలో ఉమ్మడి పౌరస్మృతిపైనా మాట్లాడారు. కుటుంబంలో ఒకరికి ఓ రూల్…ఇంకొకరికి ఇంకో రూల్ ఉండదు కదా. ఇంట్లో ఉండే అందరికీ ఎలా అయితే ఒక రకమైన రూల్స్ ఉంటాయో దేశం మొత్తం కూడా అలానే ఒకే రూల్ ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బూత్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని మరో సారి లేవనెత్తారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనను ముగించుకుని వొచ్చిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి బహిరంగ సభలోనే బీజేపీ కోర్ సిద్ధాంతాల్లో ఒకటైన ఆచరణలో తీసుకురావాలనే ఉన్న ఆకాంక్ష ఉన్న యూనిఫాల్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి మోదీ మాట్లాడారు.
యూనిఫామ్ సివిల్ కోడ్‌ని వ్యతిరేకించేవారిపై ధ్వజమెత్తారు. ఒక దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు. ‘ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుండి విడదీయరానిది. అయితే, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలలో దీనిని ఎందుకు పాటించడం లేదు’ అని ప్రశ్నించారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన యుసిసి గురించి ప్రస్తావిస్తూ..ఒక కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండడం సరికాదు. ఒక దేశం రెండు చట్టాలపై నడవదు..అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన 90 శాతం ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాగే ‘త్రిపుల్ తలాక్ కోసం వాదించేవారు.. కేవలం వోటు బ్యాంకు రాజకీయాల కోసమే వాదిస్తారు. వారి వాదనల వల్ల ముస్లిం కుమార్తెలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది’ మోదీ అన్నారు. కాగా, ఈ వర్చువల్ సమావేశంలో ముస్లిం మహిళలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ..‘ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించింది కాదు. మొత్తం కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది.
ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళను తిరిగి వారి పుట్టింటికి పంపించడంతో.. ఆమె తల్లిదండ్రులు, సోదరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తలాక్‌ని సమర్థించేవారంతా.. ముస్లిం కుమార్తెలను అణచివేయడానికే ట్రిపుల్ తలాక్ ఉచ్చును వారి మెడకు వేలాడదీయాలనుకుంటున్నారు. అయితే స్వార్థరాజకీయాలకు భిన్నంగా ముస్లిం సోదరీమణులు, కుమార్తెలు బిజెపికి, మోడీకి అండగా నిలుస్తున్నారు. కేవలం తమ ప్రయోజనాల కోసమే కొంతమందిని రెచ్చగొడుతున్నారు. ఏ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నాయో భారతీయ ముస్లింలు అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కుల గురించి చెబుతుంది. యుసిసిని అమలు చేయాలని సుప్రీమ్ కోర్టు ధర్మాసనం కూడా కోరిందని ఆయన అన్నారు.




