కవిత్వమొక స్వప్నభూమి. నిజానికది క్షణక్షణ విస్తీర్ణం కాకుంటే కళ్లముందంతా ఎడారే మిగులుతుంది. పాకృతిక కలవరమైన కవిత్వం ఆత్మను అక్షరీకరించి మనస్సులో ఆ కాంతిని ముద్రించుకుపోయేలా చేస్తుంది. కాలానికి వ్యాఖ్యానం చెప్పే శక్తి కవిత్వానికే ఉంది. కవిత్వమంటే ఇది అని తెలిస్తే స్మృతికీ, జీవనగతికీ మధ్య ఉన్న నిరంతర సంధ్యగా కవికి కాలం స్పష్టంగా బోధపడుతుంది. సృష్టి నేత్రం నుండి రాలిన మహోజ్వల రత్నంలాంటి కవిత్వాన్ని నిరంతర యాంత్రికత నుండి రసజ్ఞ మనోహరం వైపు నడిపించి ఆలోచనాశీలతను పెంచే కర్తవ్యాన్ని కవులెందరో పాటిస్తున్నారు. సునిశితమైన అనేక అంశాలను సందర్భోచిత రీతిలో డా.కె. జ్యోత్స్నప్రభ కలల పరిమళంగా అక్షరీకరించి పాఠకులకు అందించారు. ఆకాశం పరమ గంభీరం/ అంతుబట్టని గాఢ నీలం/ ఉరుముతుంది మెరుస్తుంది/ అప్పుడప్పుడు దయగా కురుస్తుంది/ అచ్చం మా బాపూలానే అని తమ తండ్రి స్వర్గీయ కొండపాక ఆగయ్యకు ఆమె ఈ కవితా సంపుటిని అంకితమిచ్చారు.
ఆచార్య కసిరెడ్డి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఎల్లా ముత్తన్నలు తమ ముందు మాటల్లో ఈ సంపుటిలోని కవితలు పఠితల్లో ఎన్నో క్రియాశీల ఆలోచనలను ప్రేరేపిస్తాయన్నారు. 38 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. కళ్లు తెరవగానే నేను / చూసే మొదటి దృశ్యం/ ఉదయ కాంతులను హరిత వర్ణాలుగా / మార్చుకొని వెలిగే ఆ మొక్కనే అని ప్రకృతిని దీపింపజేసే కుసుమోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. తనలో కొత్త ప్రాణం నింపే పరిమళాల ఊపిరే వసంతమని ప్రకటించారు. విద్వత్తేజంతో వెలగవలసిన పిల్లల మేధస్సులో యాంత్రికతను నింపి వారి ఉత్సాహంపై నీళు చల్లి మనమే నీరుగారుస్తున్నామని వేదన చెందారు. మనస్సును వెలిగించి, మంచిని పెంచి, ఆత్మలను వికసింపజేసేది చదువని అన్నారు. ఉరిమే ఉత్సాహం, మెరిసే చైతన్యం, కరిగే మనస్సు, పెరిగే జ్ఞానాలకు ప్రతిరూపాలుగా పసి పిల్లలను అద్భుతంగా మలచి భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కవిత్వపు అగ్నిలో/ నన్ను నేను నిలువెల్లా/ జ్వలింప చేసుకొని/ హృదయాన్ని వెలిగించుకొని/ కొన్ని కాంతి కవితాదీపాలను వెలిగిస్తున్నా అని చెప్పారు. ఆ కాంతి కవితాదీపాలు సాహితి వినీలాకాశంలో ఉజ్వలంగా ఎగసి అనంత వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు.
ప్రకృతే తొలినాటి గురువుగా కనిపించి కాల గమనాన్ని కవితాపాఠంగా తప్పక వినిపిస్తుందని చెప్పారు. కవిత్వమంటే కలల అలల అనువాదమని నిర్వచించారు. అంతరంగాన్ని అలల ఊయలగా ఊహించేందుకు ఒకే ఒక్క పాట చాలని తెలిపారు. నిత్య స్నేహ వసంతమొకటి తరలివచ్చి పరిమళ భాషలో తనను పలకరించాలని ఆశించారు. స్పృహనీయ సృజన చైతన్యం కాలం/ కమనీయ కవనోత్సాహం కాలం అని కాల మహిమను వెల్లడిరచారు. నవకవితానుబంధాలు హరివిల్లులై వెల్లివిరియాలని చెప్పారు. కాలంతో స్నేహమే లేకుంటే బతుకులో సౌరభం, జీవనానికి సాఫల్యం ఎక్కడిదని ప్రశ్నించారు. చిన్ని స్పందన ఆలోచనాలోచనాలను చేరి ఒక సుషుమా సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు. తలిరాకులతో ముచ్చట్లు, తొలి వేకువ రాగాలు, తెలివెన్నెల గానాలు, నెలవొంక లాలనలను తీర్చిదిద్దిన అపరబ్రహ్మ స్వరూపులుగా అక్షర మునులైన కవులను అభివర్ణించారు. కలలు, అలసిన పసి పిల్లల్లా ప్రాక్తన లాలిపాటలకు పరవశించి నిద్రలోకి జారుకొని కవిత్వాన్ని కలవరిస్తుంటాయని చెప్పారు. గ్రీష్మ తాపం గాయం చేస్తే ఋతుపవన కరచాలనం చల్లని లేపనం అవుతుందని వివరించారు.
పువ్వుల్లో నవ్వుల్లో రకాలు ఉన్నట్టే రాళ్ళల్లోను, రవ్వల్లోను ఎన్నెన్నో రకాలున్నాయని చెబుతూ అవి పలికి, జ్ఞానాన్ని పంచి తేజోవంతంగా పరిమళిస్తాయని అన్నారు. చల్లదనపు స్వచ్ఛతతో నిండిన అమ్మ తన మాటల్లో చెప్పిన ఆ ప్రవాహమే అమృతలహరి, అమర రaరిగా పిలుచుకునే మానేరు అని చెప్పారు. ఆపాత మధురాలు, ఆలోచనామృతాలైన మరీచికల వీచికల్ని తలిచారు. కాలజాలంలో కనీసం తాను కవితగానైనా మిగిలితే బ్రతుకు సార్థకమవుతుందని కవయిత్రి భావించారు. పూబాల వికసించి పరిమళించి లోకానికి వెలుగులు పంచాలని అన్నారు. కమ్ముకున్న కవిత్వాన్ని ప్రపంచానికి ఎరుక చేసే సూర్యుడే గురవని తెలిపారు. తెలుగు భాషకు వెలుగును పంచిన గిడుగును ఒక వేకువగా వర్ణించారు. అతని పేరు ప్రజాకోటి/ అతని ఊరు ప్రజావాటి అని కవితాశరథి దాశరథిని క్రాంతికారుడిగా అభివర్ణించారు. కపటం లేని, చదువుకోని, లౌక్యం నేర్చుకోని స్వర్ణకారుడి కుంపటిలో కాలం, స్వర్ణం ఏక కాలంలో కరుగుతుంటాయని ఎంతో వేదనతో తెలిపారు. నదికి మగువ మదికి/ ఎన్నటికీ తరగని ఆరాటం/ ఎప్పటికీ తప్పని పోరాటం అని చెప్పారు. మధూదయంతో శిశిర తిమిరాల జాడలు పోయి వాసంత ఉషస్సులు వచ్చి ఆశావాద పాఠం మనిషికి నేర్పుతాయని తెలిపారు.
ప్రతి బడి ఒక గుడి అని చెప్పారు. మనోజ్ఞ సంగీతం తెలుగు భాషలో ఉందని, అది అనిర్వచనీయ స్వర చైతన్యమై ఆవహిస్తుందని తెలిపారు. అన్యాయంపై రగిలిన నవకవిగా కాళోజీకి అక్షరాంజలి అర్పించారు. జీవన రణంలో అలసిపోయిన వేళ కలల పరిమళమైన, ద్వంద్వాతీత స్వర్గమైన అపురూపమైన బాల్యాన్ని తలచుకుంటేనే ఓ పులకింత అని చెప్పారు. శబ్ద కిరణాలను ప్రచంఢంగా ప్రసరించిన రవిలాంటి కవి సినారేకు అంజలి ఘటించారు. మంచి గ్రంథమే మరో ప్రపంచాన్ని చూపే మహిమాన్విత మంత్రదండమని, అది మేలైన సమాజ నిర్మాణానికి తోడ్పడే అక్షర కేంద్రమని తెలిపారు. నవ వసంతపు హరివిల్లు ఉగాదిని కిసలయల స్వప్నమని వివరించారు. కాల చక్రంలోని విషాద సంతోషాలను తట్టుకొని మనిషి నిలబడగలగాలని తెలిపారు. గుమ్మడి, తంగేడు, గునుగు, చేమంతి వంటి తీరొక్క పువ్వులు తొలి వేకువకు పొద్దులని చెప్పారు. కవయిత్రి కలం పాళీ అసిధారగా వర్షించిన ఈ కవితాక్షర తూణీరాలు భావుకతా పరిమళాలను నలుదిక్కుల్లో ప్రబలంగా పరివ్యాప్తం చేసి సాహిత్య ముద్రాంకితాలను శాశ్వతంగా నిలుపుతాయని విశ్వసిద్దాం.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





