కాలపరిణామక్రమంలో నాగరికత
తన కథను ప్రదర్శించే వింత నాటకంలో
మనిషి తన జీవన సంగ్రామంలో
‘‘మిథ్యాసౌందర్యం’’చాటున
తన మరణాన్ని మరచి
అజ్ఞానాంధకారంలో
అయోమ (మా)యసంద్రంలో
జీవితమంటే ఏమి అర్థం కాక
ఆక్సిజన్ అందని కరోనా బాధితుడిలా..
అల్లాడి తల్లడిల్లిపోతున్నాడు.
ధర్మం పేరిట అధర్మం అధికారం
చెలాయిస్తూ రాజ్యమేలుతున్నప్పుడు
‘‘నేను మళ్ళీ పుడతానని’’ ఆనాడే
చెప్పిన పరమాత్ముడు..
రెండున్నర వేల సంవత్సరాల క్రితం..
దైవం మానవ రూపేణా అన్నట్లుగా..
ఈ నేలపై గౌతమ బుద్ధుడై ఉదయించాడు..!
కోరికలను త్యజించమని
బోధి చెట్టు సాక్షిగా ఉద్యమించాడు..!!
నేటికి తన బోధనల ప్రకాశంలోనే ప్రపంచపు
మనుగడను వెతకమంటున్నాడు..!
మనిషి తాలుకూ భావోద్వేగాల
అంతరంగంలో రాగ, ద్వేష,
అహాంకారాలను బాధ్యతగా
బయటకు తీసేసి ప్రేమతో
‘‘భ్రమలను’’ జయించమంటున్నాడు..!
శాంతి మంత్రాన్ని కదనరంగాన
ఉపదేశించమంటున్నాడు..!
స్వార్థపు పర్వతాన్ని తన హృదయంలో
మోస్తున్న ఆధునిక మానవుడికి..
ఓ అవతార పురుషుడులా కనిపిస్తూ..
మళ్ళీ మళ్ళీ జ్ఞానాన్ని బోధిస్తూ
మోక్షపు పాఠాన్ని చెబుతూనే వున్నాడు..!
సత్యమే శాశ్వతమని..అహింసే మార్గమని..
యుద్ధం లో బుద్ధం మాత్రమే గెలుస్తుందని..
ప్రకృతిని గ్లోబల్ వార్మింగ్ రహితంగా మార్చాలని
లేదంటే ప్రళయమే దాని రూపమని..
శతాబ్దాలుగా తరతరాలకు ఓ తత్వమై…
కలియుగపు గీతాసారాంశమై
త్రిపీఠికల రూపంలో నలుదిక్కులు
వినపడేలా ప్రతిధ్వనిస్తూనే వున్నాడు…!!
-ఫిజిక్స్ అరుణ్‌కుమార్
9394749536




