వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ఆగస్ట్, 24: ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తోనే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు చరమగీతం పాడేందుకు పునాదులు పడతాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణ సన్నాహక సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను ఎస్సీ ఎస్టీలను మోసానికి గురి చేస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేటాయింపులో 60 శాతం ఉన్న ముదిరాజులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. పది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మోసానికి గురి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీల మొహాలు మాత్రం వేరు కానీ వారి గుణాలు మాత్రం ఒకటేనని ఈ ముగ్గురు తోడుదొంగల వ్యవహరిస్తూ ప్రజానీకాన్ని మోసానికి గురి చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు ఓవైసీ మాట నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈ మూడు పార్టీల మంత్రం ఒకటేనని రానున్న ఎన్నికల్లో ఈ వీరికి గుణపాఠం చెప్పాలని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సిపిఎం సిపిఐ పార్టీలను వాడుకొని ఈ ఎన్నికల్లో వారిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ లు మూడు ఎకరాల పొలం ఇస్తానని తెలంగాణ ప్రజానీకాన్ని తీరని మోసానికి గురి చేశారన్నారు. ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయం రాగానే మాఫీ చేశారని ఆలస్యం అయిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని మోసానికి గురి చేస్తున్నారన్నారు. ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఈ వికారాబాద్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. ఈనెల చేవెళ్లలో నిర్వహిస్తున్న సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చేయనున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చేవెళ్ల సభ నుంచి సీఎం కేసీఆర్ పట్టణం ప్రారంభం అవుతుందని కల్వకుట్ల కుటుంబానికి చరమగీతం పాడడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ రత్నారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



