కమలం మూడవసారి వికసించేనా ..

మూడవసారి తమ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వొస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని.. తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని  నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు తానే  మూడవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా మోదీ స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటుకున్న 543 స్థానాలకుగాను తమ పార్టీ సొంతంగా  370 స్థానాలను గెలుచుకుంటుందన్న విషయాన్నికూడా అంకెలతోసహా ధీమాగా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు దేశ ప్రజలు ఆశ్చర్యపోవడంతోపాటు అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మూడవసారి అధికారంలోకి రాగానే తాత్కాలిక చిన్న నిర్ణయాలకన్నా  శాశ్వతంగా ఉండే అతిపెద్ద నిర్ణయాలను తీసుకోనున్నాం.. గత దశాబ్ద కాలంగా తాము తీసుకునే నిర్ణయాలు  ఇప్పటికే నవభారత నిర్మాణానికి పునాదిగా మారాయని, రానున్న కాలంలో తీసుకునే నిర్ణయాలు శాశ్వతమవుతాయంటూ మోదీ భారత భవిష్యత్‌ను ఆవిష్కరించారు. భారత యువత అనేక కలలు కంటున్నారు.. వారి కలలను సాకారం చేయడమే మనముందున్న లక్ష్యంగా చెబుతున్న మోదీ ఆ మేరకు తీసుకుంటున్న నిర్ణయాలను ఎన్నికల వేళ  మరింత వేగవంతంచేస్తున్నారు. తాజాగా 41వేల కోట్ల విలువైన 2వేల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయడం ముఖ్యంగా పేర్కొనదగింది.

అంతకు ఒక్కరోజుముందే  48వేల వందకోట్ల మేర మరిన్ని అభివృద్ధి  ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయడం గమనార్హం. వీటిల్లో పర్యాటక రంగంతోపాటు సహజవాయువు, పెట్రోలియం, ఇందన, రహదారి, రైల్వే, వైద్యరంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. అంతటితోనే ఆగకుండా తాను భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడినని  చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు మోదీ. దేశంలో అతిపొడవైన ద్వారకా సేతును ప్రారంభించడం, సముద్రగర్భంలో నిక్షిప్తమై ఉన్న ద్వారకానగరిని స్కూబా డైవింగ్‌ ద్వారా సందర్శించి పూజలు చేయటం, దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రామమందిర ప్రారంభించడం, అబూదాబీలో భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్మించిన స్వామీ నారాయణ్‌ సంస్థ నిర్మించిన మందిర ప్రారంభోత్సవంలాంటివన్నీ ఒక విధంగా మోదీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ముందు  తీసుకున్న వేగవంత నిర్ణయాలె..

కాగా త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించుకునే పనిలోపడిరది బిజెపి. అందులో భాగంగా రానున్న ఎన్నికలముందు ప్రకటించే మ్యానిఫెస్టోలో ఈసారి ప్రజలు సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటున్నది. మ్యానిఫెస్టో రూపొందించేప్పుడు దేశవ్యాప్తంగా కనీసం కోటి మంది ప్రజలనుండి సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ఈసారి బిజెపి ఉత్తరాదికన్నా దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువ దృష్టిపెడుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలనుంచి సాధ్యమైనన్ని స్థానాలను విజయం సాధించాలని  పట్టుదలతో ఉంది. అందులో కూడా తెలంగాణ పైన ఆ పార్టీ దృష్టి పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ శంఖం పూరించాలనుకుంది. కాని, మొదట్లో చూపించిన ఉత్సాహం ఆ పార్టీ నేతల్లో చివరి వరకు కనిపించకపోవడంతో పరిమిత స్థానాలకే  పరిమితమైంది. కనీసం ఈ ఎన్నికల్లోనైనా పోయిన పరువును నిలబెట్టుకోవాలని ఆ పార్టీ రంగం సిద్దంచేస్తున్నది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 17 స్థానాలకు కనీసం 10 స్థానాలనైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నది. గత దశాబ్ధకాలంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికలతో మరుగునపడిపోతుందంటూ స్థానిక నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

ఆలాగే కాంగ్రెస్‌తో ఆ పార్టీకి చీకటి ఒప్పందముందన్న ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.  కాగా కేంద్ర నాయకత్వంకూడా గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే దూకుడును ప్రదర్శించేలా ఉన్నారు. అందులో భాగంగానే వొచ్చే మార్చిలో అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటించే ఏర్పాట్లను ఆ పార్టీ ముమ్మరం చేసింది. బిజెపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన మార్చి 4న ఖరారైంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కొనసాగిస్తూ వొస్తున్న  విజయ సంకల్ప యాత్ర ముగింపు ఉత్సవంలో పాల్గొనడంతోపాటు , రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇదిలాఉంటే అభ్యర్ధుల ఎంపికపైకూడా తీవ్ర కసరత్తును పార్టీ అధినేతలు చేపట్టారు. అయితే మొదటివిడుతగా ఆరుగురు ఎంపీ అభ్యర్దుల పేర్లు వెలుగుచూసినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం స్పష్టమవుతున్నది. పది స్థానాలను ఎట్టి పరిస్తితిలో గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ అందుకు ఇతర పార్టీలో సమర్థవంతులకోసం చూస్తుండడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కష్టకాలంలో తమ సొంత  డబ్బును వెచ్చించి పార్టీ జండాను మోయడం, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను చేపడితే ఇప్పుడు పార్టీ అధికారానికి దగ్గరలో ఉన్న క్రమంలో ఇతర పార్టీల నుండి వొచ్చినవారికి అవకాశమిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల దిల్లీ లో  జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలోకూడా దీనిపైన చర్చజరిగినట్లు తెలుస్తున్నది. ఒక విధంగా గెలుపే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలో కొనసాగుతున్న ఘర్షణలు ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *