కబ్జా చెరలో పీర్జాదిగూడ చెరువు..!

  • కబ్జాలతో ఉనికిని కోల్పోతున్న వైనం..
  • పట్టింపులేని సంబందిత అధికారులు..

నీటి వనరుల ఆక్రమణలతోనే గత కొన్నాళ్ళ క్రితమే పీర్జాదిగూడలో వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా అనుభవించాం. ఆ సమయంలో చెరువుల సమీపంలో నివసిస్తున్న, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన దుర్భర క్షణాలను ఇప్పటికీ మరవలేకున్నాం. పీర్జాదిగూడ పెద్ద చెరువు ఆక్రమణలతో రోజుకింత కుచించుకుపోతోంది.. సంబందిత శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడి నగరంలోని చెరువు భూమి యధేచ్చగా అన్యాక్రాంతమవుతోంది. కబ్జాకోరులు రాత్రి వేళల్లో మట్టితో పూడ్చుతూ చెరువును రోజుకింత తెగనమ్ముతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.. ప్రజాప్రతినిధుల స్వార్థం.. అధికారల ఉదాసీనతే దీనికి ప్రధాన కారణమని, రక్షకులే భక్షకులుగా మారారనే ఆరోపణలు సర్వత్రా గుప్పుమంటున్నాయి..

(మేడిపల్లి, ప్రజాతంత్ర)
రాజధాని మహా నగర శివార్లలోని భూముల ధరలు ఆకాశాన్నంటుతూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, నదుల శిఖం భూములు కబ్జాదారుల వలలో చిక్కుకుని హారతి కార్పురంలా ఆవిరవుతున్నాయి. తాజాగా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ పెద్ద చెరువుకు ఇదే దుస్థితి దాపురించింది. ఈ చెరువుపై కన్నేసిన భూబకాసురులు రాత్రి సమయాల్లో మట్టి పోయిస్తూ అడ్డగోలుగా కబ్జా చేస్తూ దర్జాగా ఇండ్లు కట్టిస్తూ బాహాటంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా చెరువు శిఖం భూమిని, చెరువు భూమిని అడ్డగోలుగా అమ్ముకుంటున్నా ఇరిగేషన్‌, ‌రెవెన్యూ, మున్సిపల్‌ ‌శాఖల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ట స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెవెన్యూ విలేజ్‌ ‌నక్షా ప్రకారం పెద్ద చెరువు విస్తీర్ణం దాదాపు 34.11 ఎకరాలుగా ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ విస్తీర్ణంలో ఇప్పటికే సగభాగం కూడా ఉందో లేదో కూడా తెలియని సందిగ్ధత నెలకొన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. నగరం విస్తరిస్తూ జనావాసాలు పెరుగుతుండడంతో చెరువు నానాటికీ తన ప్రాభవాన్ని కోల్పోతూ కుచించుకుపోవడం గమనార్హం. రాష్ట్రంలో చెరువుల సంరక్షణ, పరిరక్షణకు భూగర్భ జలాలు ఒడిసిపట్టేందుకు, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని గత ప్రభుత్వం మిషన్‌ ‌కాకతీయ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయినా నగరంలో మాత్రం చెరువులు రోజురోజుకు కబ్జాల భారిన పడుతూ ఉనికిని కోల్పోతున్నాయి. ఇదే పెద్ద చెరువు సుందరీకణకు హెచ్‌ఎం‌డీఏ రూ. 15 కోట్ల వరకు నిధులు వెచ్చించి పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చింది.

సందర్శకులకు ఆహ్వానం పలికేందుకు సుందరంగా తీర్చిదిద్దిన స్వాగత ద్వారం, పటిష్టమైన రిటర్నింగ్‌ ‌వాల్‌ ఏర్పాటు చేసి మినీ ట్యాంక్‌ ‌బండ్‌లా మార్చింది. పచ్చిక బయళ్లతో కూడిన పార్కులు, అందమైన, రంగురంగుల పూల మొక్కలు, బతుకమ్మల నిమజ్జనానికి ఘాట్‌ ఏర్పాటు, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, వ్యూ పాయింట్‌, ‌వాకింగ్‌ ‌ట్రాక్‌ ‌తదితరాలను ఏర్పాటు చేసి సుందరంగా రూపొందించారు. పెద్ద ఎత్తున నిధులతో చెరువు సుందరీకరణను స్థానికులు స్వాగతిస్తూనే కబ్జాలను మాత్రం నియంత్రించలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ ‌హద్దులు నిర్ధారించినా వాటిని ఖాతరు చేయకుండా చెరువులో సైతం మట్టి పోసి కప్పివేయడం ఆ తరువాత ఇండ్ల నిర్మాణం చేపట్టడం తంతుగా మారినా అధికారులు అడపాదడపా తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నట్లు చేయడం ఆ తరువాత అక్కడ కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులను, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇదే విషయమై సంబందిత ఇరిగేషన్‌ ‌శాఖ అధికారిని వివరణ కోరగా చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో మట్టి పోసి పూడ్చి వేసి కబ్జాలకు పాల్పడుతున్నది నిజమేనని అంగీకరించారు. అయితే ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదులు చేశామని, మున్సిపల్‌ అధికారులు తమకు అంతగా సహకరించడం లేదని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా చెరువుల ఆక్రమణలపై సంబందిత ఇరిగేషన్‌, ‌రెవెన్యూ, మున్సిపల్‌ ‌శాఖల అధికారులు సమన్వయంతో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన కఠిన చర్యలు చేపట్టాలని పీర్జాదిగూడ నగర ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *