కనీవిని ఎరుగని రీతిలో జాతర నిర్వహణ

మేడారంలో భక్తులందరికీ వీఐపీ తరహా సౌకర్యం..
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
అనుభవమున్న అధికారులనే విధుల్లోకి..
రెవెన్యూ,  గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం  పంచాయతీ రాజ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయతో కలిసి మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..మేడారం జాతరకు వొచ్చే భక్తులందరికీ వీఐపీ తరహాలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు.  ప్రభుత్వం భక్తులపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 58 లక్షల మంది తల్లులను దర్శించుకున్నారు. రెండు కోట్ల మంది భక్తులు మేడారం రానున్నట్లు అంచనా వేశామని, ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత జాతరలో అనుభవం ఉన్న అధికారులను ప్రత్యేకంగా నియమించామని, రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 6వేల  ఆర్టిసి బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 కోట్ల మంది ఆడబిడ్డలు  జీరో టికెట్‌ తో ప్రయాణించారని. జాతరకు  మహిళలు  అధిక సంఖ్యలో వొచ్చే అవకాశం ఉన్నందున బస్సుల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

మేడారంలో దాదాపు  16 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నారు.  పారిశుధ్యంపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని,  పారిశుధ్య నిర్వహణకు 4 వేల మంది కార్మికులను విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు.  జాతర కోసం 270 కిమీ రోడ్డులును అభివృద్ధి చేశామని  అలాగే  తాగునీటికోసం అన్ని  ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే ఐదేళ్లలె  అమ్మవార్ల  దయతో ముఖ్యమంత్రి నాయకత్వం లో ప్రజల కోరికలను నెరవేరుస్తామన్నారు.  మంత్రి  దనసరి అనసూయ దగ్గరుండి స్వయంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారని తెలిపారు.  ప్రభుత్వం ఏర్పడి న  తరువాత  జరుగుతున్న అతి పెద్ద జాతర, ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు క్రమశిక్షణతో ఆతృత పడకుండా తల్లుల దర్శనం చేసుకోవాలని కోరారు. మంత్రి దనసరి అనసూయ మాట్లాడుతూ భక్తులు సులభంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గత రెండు నెలల నుంచే మేడారానికి  భక్తులు పోటెత్తారన్నారు. ముందస్తుగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే మొదటిసారి అని   అన్నారు. నిరంతరం మేడారం పనులు పర్యవేక్షించిన అధికార యంత్రాగానికి ఆమె  ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాఫిక్‌ కు  అంతరాయం కలగకుండా ఆర్టిసి బస్సుల్లో  జాతరకు రావాలని మంత్రి భక్తులకు సూచించారు.  ఇది రాష్ట్ర పండుగ అని జాతర విజయవంతానికి  అందరూ సహకరించాలని  కోరారు. తల్లుల దీవెనతో భక్తుల సౌకర్యానికి  అందరం సమష్టిగా కృషి చేద్దామని  పిలుపునిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని మీడియాను  ప్రత్యేకంగా కోరారు. జాతర అనంతరం ప్రతీ రూపాయి లెక్క ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.  మేడారంలో శాశ్వత పనులు చేపడతామని తెలిపారు.  తల్లుల కీర్తిప్రతిష్టలు శిలాశాసనం చేసి చరిత్ర  లిఖించేందుకు కృషి చేస్తామన్నారు.  జిల్లా అధికారులు జాతరలో విధులు నిర్వహిస్తునందున గ్రామాల్లో తాగునీటి ఇతర సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని, ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో  సమాచార పౌర సంభంధాల శాఖా ప్రత్యేక కమిషనర్‌ హనుమంత రావు, ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠీ  తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *