కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు రాదా ఇక మోక్షం??…

  • ముందుకు సాగని రూ. 225 కోట్ల మంజూరీ ప్రతిపాదనలు!
  • సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ఆధ్వర్యంలో
  • సింప్‌ ‌కింద ‘కడెం’ ఎంపిక…

భారీ  వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయినాయి. ఇటీవల ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గనైజేషన్‌, ‌స్టేట్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ ఆఫీసర్లు ప్రాజెక్టును సందర్శించి ఆధునికీకరణకు సంబంధించి చేసిన సూచనలు ఆచరణకు దూరంగా ఉన్నాయి. కడెం ప్రాజెక్టును సపోర్టు ఫర్‌ ఇరిగేషన్‌ ‌మాడ్రనైజేషన్‌ ‌ప్రోగ్రామ్‌(‌సింప్‌) ‌పరిధిలోకి చేర్చి రూ.225 కోట్లతో చేసిన 36 ప్రతిపాదనలకు ఆమోదం లభించి, నిధులు మంజూరై, కార్యాచరణ ప్రణాళిక అమలైతే, కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు మోక్షం లభించనుంది. ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించే లక్ష్యంతో, అవిభక్త ఆదిలాబాద్‌ ‌జిల్లా, ప్రస్తుత విభక్త నిర్మల్‌ ‌జిల్లాలో గోదావరి నది ఉపనది అయిన కడెం, గోదావరి నదిలో కలిసే ప్రదేశంలో నిర్మల్‌ ‌పట్టణం నుండి 40 కిమీ దూరంలో పెద్దూరు గ్రామం వద్ద కడెం ప్రాజెక్టు నిర్మించారు. 1944లో నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు తయారు చేయగా….1949 నుంచి 1952 మధ్య కాలంలో ప్రాజెక్టును నిర్మితమైంది. ఆ ప్రాంత నాయకుడు కడెం నారాయణరెడ్డి జ్ఞాపకార్థం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌గా అధికారికంగా నామాంకితమయింది.

ఆదిలాబాద్‌ ‌జిల్లా బోర్డ్ ‌సమీపంలోని పొచ్చెర, ఇచ్చోడ వద్ద ఉన్న కుంటాల జలపాతం వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతోనే మొదలవుతుంది. కడెం ప్రాజెక్టు మొదట 5.5-టీఎంసీల సామర్థ్యంతో కొన్ని గేట్లు 2.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాటిసితో నిర్మించారు. ఇది ఎడమ, కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా పెద్ద బెల్లాల్‌ ‌చిన్న బెల్లాల్‌, ‌చిట్యాల్‌, ‌కొండుకూర్‌, ‌కన్నాపూర్‌, ‌మోరిగూడెం, పాత కొండుకూర్‌, ఉప్పరగూడెం, చిన్నా శిబిరం, పెర్కపల్లి, కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా జన్నారం, దండేపల్లి, తాళ్లపల్లి, మ్యాదార్‌ ‌పేట్‌, ‌లక్సెట్టిపేట మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. 1984లో శ్రీరాంసాగర్‌ ‌నార్త్ ‌కెనాల్‌ ‌సరస్వతీ కాలువ నుండి కడెం ప్రాజెక్టుకు లింకు చేశారు. దీంతో మొత్తం 68 వేల ఎకరాల ఆయకట్టుకు కడెం ప్రాజెక్టు నుండి నీరు అందుతుంది. కడెం ప్రాజెక్టు దిగువన ఐదారు కిలోమీటర్ల దూరంలో కడెం నది గోదావరిలో కలుస్తుంది.

అలా ప్రస్తుతం ఈ డ్యామ్‌ 68000 ‌హెక్టార్ల వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీరుస్తుంది. 1958 ఆగస్టు 30, 31న వొచ్చిన వరదకు ప్రాజెక్టు కొట్టుకు పోయింది. 5.19 లక్షల క్యూసెక్కుల వరద వొచ్చి ఉంటుందని అప్పటి అధికారులు అంచనా వేశారు. తర్వాత ప్రాజెక్టు ఎత్తును 1.20 మీటర్ల పాతవి, కొత్తవి కలిపి 18 గేట్ల 3.28 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ ‌కెపాసిటీతో ప్రాజెక్టును 1959 నాటికి పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ 1995లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వరద తాకిడికి కడెం ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకు పోయాయి. పొచ్చెర, కుంటాల, బజార్‌ ‌హత్నూర్‌ ‌ప్రాంతాల్లో గుట్టల పై నుండి వచ్చే వరద నీరు చేరుతుండటం, ఇసుక మేటలు వేస్తున్న కారణంగా ఏటా మామూలు రుతుపవన వర్షాలకే ప్రాజెక్టు నిండు కుండగా మారుతున్నది.

ప్రస్తుతం…కడెం ప్రాజెక్టు గరిష్ఠ ఎత్తు 700 అడుగులు కాగా…గతంలో గరిష్ఠగా 2.90 లక్షల క్యూసెక్కుల వరద రాగా, గత ఏడు కురిసిన భారీ వర్షాలకు ఒకేసారి 5 లక్షల క్యూసెక్కుల పైన వచ్చిన కారణంగా…అధికమైన నీరు గేట్ల పై నుండి పారిన నేపథ్యంలో అధికారులు చేతులెత్తక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడటంతో భారీగా వరద నీరు బయటకు వెళ్ళిపోయి, ఊపిరి పీల్చుకునేలా చేసింది. మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.6 టీఎంసీలు కాగా, మొత్తం గేట్లు కిందికి దిగని కారణంగా 40 టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి పాలైంది. ప్రాజెక్టు రెండో గేటు, మూడోగేటుకు సంబంధించి కౌంటర్వేటర్లు వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదనీటిలో మునిగి 9 జర్మనీ గేట్లకు నష్టం కలిగింది. ఏడు స్వదేశీ గేట్లు  చెడిపోయాయి. దాదాపు రూ.7కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడు కూడా అదే పరిస్థితి పునరావృతమై, 2, 3, 6, 8 మొత్తం 4 గేట్లు తెరుచుకోక, 14 గేట్ల ద్వారా కాకుండా మిగిలిన వరద నీరు ఓవర్‌ ‌ఫ్లో అయింది. ఇన్‌ ‌ఫ్లో తగ్గి ప్రమాదం నుండి గట్టెక్కడం జరిగింది. స్వప్న ప్రాజెక్టు ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గేట్ల ఎత్తివేత, ఆపరేషన్‌ ‌పనులు చేపట్టారు.

క్రేన్‌ ‌ఫుల్‌ ‌లిఫ్ట్, ‌మాన్యువల్‌ ‌లేబర్‌ ‌సాయంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు.అయితే జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రాజెక్టు గేట్ల పరిస్థితిని ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించింది. డ్యామ్‌ ‌సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌, ‌స్టేట్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ ఆర్గనైజేషన్‌ ‌సంబంధిత 24 మంది నిపుణులు శుక్రవారం కడెం ప్రాజెక్టు సందర్శన గావించి, పరిస్థితిని పరిశీలించారు. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. మళ్లీ వరదలొస్తే ప్రమాదం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ‌నిపుణులు గత సంవత్సరమే పలు ప్రతిపాదనలు చేశారు. కడెం ప్రాజెక్టును సపోర్టు ఫర్‌ ఇరిగేషన్‌ ‌మాడ్రనైజేషన్‌ ‌ప్రోగ్రామ్‌(‌సింప్‌) ‌పరిధిలోకి చేర్చి రూ.225 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. కొత్తగా 5 వరద గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 9 జర్మనీ గేట్లు ప్రతిసారీ ఇబ్బందులకు గురి చేస్తుండడంతో, తొలగించి ఇండియన్‌ ‌గేట్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా మరో 5 గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో మొత్తం 23 గేట్ల ద్వారా వరదనీటిని వేగంగా దిగువకు వదిలే అవకాశం కలుగనుంది.

సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న సపోర్ట్ ‌ఫర్‌ ఇరిగేషన్‌ ‌మాడ్రనైజేషన్‌ ‌ప్రోగ్రామ్‌(‌సింప్‌) ‌కింద కడెం ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ స్కీము ఆసియన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌బ్యాంక్‌ ఆర్థిక సహకారం లభించనుంది. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే రూ. 225 కోట్లు మంజూరవుతాయి. ప్రధాన కాలువ పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడం వల్ల వరద నీరు వేగంగా కిందికి వెళ్తుంది. దీంతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, కాలువల లైనింగ్‌ ‌పనులు కూడా చేపట్టనున్నారు. సదరు ప్రతిపాదనలకు పరిపాలనా మంజూరు లభించినా, టెక్నికల్‌ ‌సాంక్షన్‌ ‌రావాల్సి ఉంది. అది మంజూరైతే తప్ప మరో మార్గం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *