మగాడు శాస్త్రకారుడై అపుత్రస్య
గతిర్నాస్తని విషం కక్కితే!
ఆతడు నిరాదరించిన తల్లిదండ్రుల్ని
ఆదరణతో గుండెలకు హత్తుకుని
అపుత్రికస్య గతినాస్తని తిరగరాసింది!
వంటింటి కుందేలు కమ్మని శాసిస్తే
అంతరిక్షాన్నే అలవోగ్గా చుట్టి
సత్తా చాటింది!
అబలవని కించపరచబోతే
అన్నిట్లో మగాళ్ళను మించి
సబలనంది!
ఏ రంగమైనా సరే.. ఆమె దిగనంత
వరకే! ఆమె రంగప్రవేశం చేసిందా
అతడి మేకపోతు గాంభీర్యం
బట్టబయలు!
నిబద్ధత నిజాయితీ ఓర్పు..
ఆమె విజయ రహస్యాలు
పురుష విజయాల తెర వెనుక
సూత్రధారిణి కూడా తనే!
పురుషాధిక్య కుటుంబ వ్యవస్థలో
అంతఃసూత్రమై తన ఉనికిని
శాశ్వతంగా ప్రతిష్టించుకొని..
పురుషుడు వివక్షతో తన నుదుటి
రాతను ఏమార్చి రాసినా
తను మాత్రం అతడికి తగిన
గౌరవం స్థానం ఇచ్చి ఆడదంటే
భువిపై అద్భుతాల ఆదిమూర్తి
అని నిరూపించుకొంది..!
(నేడు ప్రపంచ మహిళా దినోత్సవం)
-భీమవరపు పురుషోత్తమ్
ఎస్‌బీఐ, ఇన్నీస్‌పెట్ బ్రాంచ్,
రాజమండ్రి, 9949800253





