మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. గురువారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్ట మైసమ్మ అమ్మ వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మొట్టమొదటి ఎన్నికల కరపత్రాన్ని కట్ట మైసమ్మ అమ్మవారికి సమర్పించి తనని ఆశీర్వదించ వలసిందిగా అమ్మవారిని వేడుకుంది. అనంతరం ఏంఏంసి 35వ డివిజన్ లెనిన్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ సౌందర్య విజయ్ తో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష, అభిరుచి మేరకు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. అభివృద్ధి, సంక్షేమాని చూసి ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బస్తీ వాసులకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు రాగానే.. ప్రజలకు ఏమి చేయని వారు కూడా వచ్చి, కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ అమ్మ వారికి సబితారెడ్డి ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం





