- మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి
- విపక్షాలకు కూడా ఆ విషయం తెలుసు
- కాంగ్రెస్, బిజెపి నాయకులు సంక్రాంతి ముందు వొచ్చే గంగిరెద్దులోల్లు..
- ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపిస్తరు…వారి కల్ల బొల్లి మాటలకు మోసపోవద్దు
- మోసపూరిత వాగ్దానాలకు గోల్ మాల్ కావొద్దు
- ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
- తొందరలోనే మంచి శుభవార్త తెలంగాణ ప్రజలు వింటరు
- బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో రూ. 900 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం ప్రజల కోసమే పరితపిస్తారని, కంటికి కునుకు లేకుండా ప్రజల బాగుకోసం కష్టపడుతున్నారని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వొస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. తెలంగాణలో తొమ్మిదిన్నరెళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశం గర్వించేలా చక్కదిద్దింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు. కనీ, విని, ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్, బిజెపిల పాలనలో దేశం సాధించిందేమీ లేదని, వాళ్ల హయాంలో ప్రగతి శూన్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజల చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కోరడం ఆత్మగౌరాన్ని చంపడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేర్వేరు బహిరంగ సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. వరంగల్ హనుమకొండ పట్టణాల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో విద్యార్థులు ప్రాణాలు అర్పించి పోరాడితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను నేరుగార్చిందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో 2004లో పొత్తుకుదుర్చుకుని అధికారంలోకి రాగానే మళ్లీ మోసం చేసిందని వివరించారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో దేశం సాధించిన అభివృద్ధి శూన్యం అన్నారు.
ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా మాత్రమేనని వివరించారు. మోదీ అధికారంలోకి వొచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంపై ఎప్పుడు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కన్నతల్లిని చంపేసి బిడ్డను వేరు చేశారని విషయం కక్కుతున్న మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో వోట్లు అడుగుతాడని ప్రజలను ప్రశ్నించాడు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఆయన హయాంలో పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు చూసి కనువిప్పు తెచ్చుకోవాలని గుర్తు చేశారు. రూ .400 గ్యాస్ ధర 1200కు పెంచినందుకు మహిళలు మోదీని ఆశీర్వదించాల్నా అని కెటిఆర్ ప్రశ్నించారు. 60 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వం కాదా అన్నారు. పెట్రోలు 70 రూపాయల నుంచి 110 రూపాయలు చేసినందుకు యువత మోదీని గెలిపించాలా అని దుయ్యబట్టారు. ఇన్ని తప్పులు తన దగ్గర పెట్టుకుని తెలంగాణపై విషం కక్కడమే అలవాటుగా మోదీ తయారయ్యాడని విమర్శించాడు.
కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నామని కెటిఆర్ గుర్తు చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయకుండా ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో, ముసలి కన్నీళ్లతో, మళ్ళీ అధికారం కావాలని, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అడగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉండేదా అనీ ప్రజలకు అడిగారు. మంచినీళ్ల కోసం బారులు తీరిన పరిస్థితులు ఆయన గుర్తు చేశాడు. మహిళలకు, విద్యార్థులకు, యువకులకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. ఇంతకాలం ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారులోకి వచ్చిన తొమ్మిదిన్నర ఏళ్లలో కరెంటు కష్టాలు తీరాయని గుర్తు చేశాడు. సాగునీరు, తాగునీరుతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నదని వివరించారు.
ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం తెలంగాణ ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పారు. ఒకప్పటి నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానకు అనే నానుడి పోయి సర్కారు దవాఖానకు మాత్రమే వెళదామనే స్థాయికి వచ్చిందని చెప్పాడు. దేశంలోనే అతిపెద్ద వైద్య శాల వరంగల్ లో నిర్మిస్తున్నామని, 24 అంతస్తులతో అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ ఆసుపత్రి తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు దసరా వరకే పూర్తిస్థాయిలో నిర్మితం చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి అయితే ఎక్కడ అప్పు అడుగుతారో అని బంధువులు ముఖం చాటేసే వారని, అది దృష్టిలో ఉంచుకుని కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రుల ముఖాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించాడు.





