ఓసీల్లో కలవాలన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : సామజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ముదిరాజ్ లని తప్పుదోవ పట్టించేలా తీన్మార్ మల్లన్న సోమవారం తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన బిసి సంఘాల సదస్సులో ముదిరాజ్ లను ఓసీలల్లో కలవాలని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్ అన్నారు. తీన్ మార్ మల్లన్న తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముదిరాజ్ ల అగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కార్యదర్శి గోనెల కుమారస్వామి ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అల్లాదుర్గం సురేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో ముదిరాజుల దుస్థితిని గుర్తించి జీవో 15 ద్వారా బీసీ ఏ లో చేర్చారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని కోర్టులలో సవాలు చేసి 12 సం.లుగా సుప్రీంకోర్టులో ఉంచి పరిష్కరిస్తామని చెప్పి తెలంగాణ బీసీ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చి 11 నెలలు గడిచినప్పటికీ బీసీ కమీషన్ ద్వారా సమస్య పరిష్కరించడం లేదన్నారు. ముఖ్యమంత్రికి భజన చేస్తూ పదవులు పొంది ముదిరాజ్ సంక్షేమాన్ని గాలికి వదిలేసిన బండా ప్రకాష్ ముదిరాజ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో 15 అమలు చేసి తమను బిసి-డిలో చేర్చాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని రామన్నపేట, హాస కొత్తూరు, కొండ్రికల్ గ్రామాలలో జరిగిన ముదిరాజుల సామాజిక బహిష్కరణను, ముదిరాజులపై జరుగుతున్న దాడులను, ముదిరాజులపై పెడుతున్న అట్రాసిటీ కేసులను, భూములు లాక్కోడాన్ని ప్రశ్నించకుండా పరిష్కారాలను చూపకుండా తన ప్రయోజనాల కొరకు ముదిరాజులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న తీరును యావత్ ముదిరాజ్ సమాజం గమనిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు ఎండ్ల బాబు రావు ముదిరాజ్, యువజన విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సీనేటి శ్రీనివాస్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు సంజయ్ తోట ముదిరాజ్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి బోయిని మధు, నాయకులు సత్యనారాయణ ముదిరాజ్, కొటికే రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *