- 8 ఏళ్లయినా లబ్దిదారులకు అందని రెండు పడక గదుల గృహాలు
- బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాల పర్వం
- గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారు
- వరంగల్ తూర్పు పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
సుబేదారి(వరంగల్), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు ఎనిమిదేళ్లయినా పూర్తిగా అమలు కాలేదని రెండు పడక గదుల ఇండ్లు లబ్దిదారులకు అందలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజిఎం సెంటర్లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ…వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ నేతలు ప్రజల సమస్యలు గాలికొదిలి గుండాయిజం చేస్తూ భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం రాత్రి హన్మకొండ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే పవన్‌పై దాడి జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరని, గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు వ్యవసాయదారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ముఖ్యంగా విద్యా వైద్య రంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరంగల్‌కు వొచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వరంగల్ హనుమకొండ ప్రాంతాలలోని అనేక ప్రాంతాలు పర్యటించి అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని, వెంటనే పనులు ప్రారంభిస్తారని నాకు కల్లు, గూడాలు పెట్టాలని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఏమి పరిష్కరించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను మభ్యపెట్టి మాటలు మాట్లాడి వోట్లు వేయించుకున్న టిఆర్ఎస్ నాయకులు హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులు కేవలం భూకబ్జాలకు పాల్పడడమే ప్రధాన ఉద్దేశం పెట్టుకున్నారన్నారు.
కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమ రాజ్యం ఏర్పడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఇందుకు వరంగల్ ప్రజలు సహకరించాలని జనవరి 2024 నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని భూకబ్జాలకు పాల్పడిన వ్యక్తులపై న్యాయ విచరణ చేపడతామన్నారు. దారి వెంబడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, స్థానిక ఎంజీఎంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ నాకు తెలుసని వీటిని కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంజిఎం నుంచి వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సి కొండా మురళీధర్‌రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.



