ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర రహదారులన్నీ మహాగర్జనకు వొస్తున్న అభిమానులతో కిక్కిరిపోయినాయి. శ్రీకాంతాచారి ప్రాంగణానికి వొచ్చే జనమంతా కిలోమీటర్ల దూరంలో గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. తెలంగాణ ఏర్పాటుపై ఆనాటి హోం శాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై వ్యతిరేక మాఫియా చర్యలను నిరసిస్తూ నిర్వహించిన ఈ సభలో ముఖ్యఅతిధిగా స్వామీ అగ్నివేష్‌ తోపాటు ముంబాయి, సూరత్‌, ఔరంగా బాద్‌లనుండి కూడా జనం తరలివొచ్చారు. ఆనాటి సభ రాష్ట్రసాధన కోసం స్వచ్చందంగా తరలివొచ్చిన ప్రజా ప్రభంజనమనే చెప్పాలె. ఫలితంగా రెండు సార్లు ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కడుతూవొచ్చారు.’’

ఓరుగల్లులో మరోసారి గర్జించేందుకు బిఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది.  బి(టి)ఆర్‌ఎస్‌కు మొదటినుంచీ వరంగల్‌ సెంటిమెంటు అధికం. ఆ పార్టీ ఉద్భవించిన నాటినుండీ నేటి వరకు, ఉద్యమం నుండి పథకాల అమలు వరకు వరంగల్‌ నుంచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వొస్తున్నది. తెలంగాణరాష్ట్ర పోరాటంలో ఉద్యమం చప్పపడుతుందను కున్నప్పుడల్లా వరంగల్‌లో భారీ స్థాయిలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం, సభ విజయవంతం కాగానే, తిరిగి వెయ్యి ఏనుగుల బలంతో మళ్ళీ పోరాటానికి సిద్ధ్దపడడమన్నది అనవాయితీగా మారింది. అంటే బి(టి)ఆర్‌ఎస్‌ పార్టీకి ఒక విధంగా వరంగల్‌ ఆక్సీజన్‌ వంటిది. ఇక్కడ సభ విజయవంతం అయిందంటే ప్రజలు తమవెంట ఉన్నారన్న సంకేతం ఆ పార్టీకి అందినట్లే.  శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మెరుపు పర్యటన చేసిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ కూడా అదే విషయాన్ని వెల్లడిరచారు. తాము  వరంగల్‌ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. ఇరవై మూడేళ్ళుగా వరంగల్‌ ప్రజలు తమకు అండగా నిలుస్తున్నదన్నారు. ఉద్యమకాలంలో వరంగల్‌ ప్రజ ఇతర ప్రాంతాలకన్నా కదనరంగంలో ముందువరుసలో నిలిచింది.

ఉద్యమం  బలహీన పడకుండా టానిక్‌, ఆక్సీజన్‌లను చేకూర్చి ఉద్యమకారులను ఉత్సాహపరిచిన చరిత్ర వరంగల్‌కుంది, ఈ ప్రాంతానికి సర్వదా  రుణపడి ఉంటామని ఆయన  మరోసారి వరంగల్‌ ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకున్నారు. వొచ్చే పదేళ్ళలో వరంగల్‌ను హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి పరుస్తామన్న మాటకూడా ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన తాజాగా  హనుమకొండ, వరంగల్‌ శాసనసభ నియోజ కవర్గాల పరిధిలో దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారనే అనుకోవాలి.   ప్రస్తుత పరిస్థితిలో  బిఆర్‌ఎస్‌ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో  రాజకీయ వొత్తిడిని ఎదుర్కుంటోంది. ఆ పరిస్థితిలో మరోసారి తనబలాన్ని బేరీజు వేసుకునే అవసరం ఆ పార్టీకి ఏర్పడిరది. తన సెంటిమెంట్‌ ప్రకారం వరంగల్‌లో సభ నిర్వహించడం ద్వారా మరోసారి  ఆక్సీజన్‌ను నింపుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. ఈ నెల 16వ తేదీన ఇక్కడ భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది.

రాష్ట్రంలోని ఇతర పార్టీలకన్నా ముందే అధికార బిఆర్‌ఎస్‌ 115 మంది అభ్యర్ధులను ప్రకటించింది. అభ్యర్ధులంతా అప్పుడే రంగంలోకి దూకారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, అధికారిక అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల, మండలాలు కోలాహలంగా మారాయి. ప్రతి పక్షాలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించకపోయినా ప్రచార కార్యక్రమాల్లో అధికారపార్టీతో పోటీ పడుతున్నాయి. తమ పార్టీల అధినేతలను ఆహ్వానించి ఇప్పటికే బహిరంగ సభలతోపాటు తమ పార్టీ అధికారంలోకి వొస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తాయన్నవాటిని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలురాగా, బిజెపి పార్టీ పక్షాన స్వయంగా ప్రధాని నరేంద్రమోదీయే మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. కాగా విపక్షాలకు తన సత్తా చాటే విధంగా ఇప్పుడు బిఆర్‌ఎస్‌ భారీ స్థాయిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నది.

తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాల నుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర రహదారులన్నీ మహాగర్జనకు వొస్తున్న అభిమానులతో కిక్కిరిపోయినాయి. శ్రీకాంతాచారి ప్రాంగణానికి వొచ్చే జనమంతా కిలోమీటర్ల దూరంలో గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుక్కుపో యారు. తెలంగాణ ఏర్పాటుపై ఆనాటి హోం శాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై వ్యతిరేక మాఫియా చర్యలను నిరసిస్తూ నిర్వహించిన ఈ సభలో ముఖ్యఅతిధిగా స్వామీ అగ్నివేష్‌ తోపాటు ముంబాయి, సూరత్‌, ఔరంగా బాద్‌లనుండి కూడా జనం తరలివొచ్చారు. ఆనాటి సభ రాష్ట్రసాధన కోసం స్వచ్చందంగా తరలివొచ్చిన ప్రజా ప్రభంజన మనే చెప్పాలె. ఫలితంగా రెండు సార్లు ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కడుతూవొచ్చారు.

కాని నేడు సీన్‌ మారుతూ వొస్తున్నది. ఉద్యమ పార్టీపైన క్రమేణ నమ్మకాలు సన్నగిల్లు తున్నాయి. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చట ంలేదన్న అపవాదను బిఆర్‌ఎస్‌ మూటకట్టుకుంది. తాము కలలు కన్న తెలంగాణకు భిన్నమైన పాలన నడుస్తుందన్న విమర్శలున్నాయి.  దానికి తగినట్లుగా ఇప్పుడు రాష్ట్రంలో ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీ బిఆర్‌ఎస్‌పై యుద్ధాన్ని ప్రకటిస్తు న్నాయి. వీటిని తట్టుకుని నిలబడి, హ్యాట్రిక్‌ కొట్టేందుకు బిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తనకు మొదటినుండీ సెంటిమెం ట్‌గా ఆక్సీజన్‌ను అందిస్తూ వొస్తున్న వరంగల్‌ నుండే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలను కుంటోంది అధికార పార్టీ. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ  ఇక్కడ ఎన్నికల మాని ఫెస్టోను ప్రకటించడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలను కుంటోంది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆనాటికి కోలుకునే అవకాశా లున్నాయి. ఈ లోగా ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుద లయ్యే అవకాశం ఉంది. అప్పుడు నోటిఫికేషన్‌ అనంతరం జరిగే మొదటి బహిరంగ సభ కూడా ఇదేఅవుతుంది. సుమారు పదిలక్షల మందితో ఈ సభను మరే పార్టీ నిర్వహిం చనంత బ్రహ్మాండంగా నిర్వహించాలన్న ప్రయత్నంలో పార్టీ వర్గాలు ఇప్పటినుండే ఏర్పాట్లలో మునిగిపోయారు. 150 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని, సుమారు 200 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

ఉద్యమ పార్టీనుండి రాజకీయ పార్టీకి, ఆ తర్వాత జాతీయ పార్టీగా మార్పు జరిగిన తర్వాత మొదటిసారిగా నిర్వహించే భారీ స్థాయి బహిరంగసభ కూడా ఇదే కావడంతో  దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీలోని అన్ని క్యాడర్‌లకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, మండల స్థాయిలో అభివృద్ధి సంబరాలను జరుపుకోవడం ద్వారా దశాబ్ద కాలంగా తాము చేసిన ప్రగతిని తెలియజెప్పే ప్రయత్నాన్ని బిఆర్‌ఎస్‌ చేస్తోంది. ఇందిలా ఉంటే 2001 నుండి ఇంతవరకు వరంగల్‌లో బిఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభలన్నీ విజయవంతం అవుతూనే ఉన్నాయి. అయితే  రాష్ట్రసాధనే ఆనాటి లక్ష్యం. ఇప్పుడు అధికార లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పరిస్తితిలో ఈ నెల 16న జరిగే సభ మాత్రం గత పదేళ్ళుగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు అద్దంపట్టేదిగా ఉంటుందన్నది మాత్రం నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *