- లేకుంటే నేడు రిజిస్ట్రార్ కోర్టుకు హాజరు కావాల్సిందే
- హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 14(ఆర్ఎన్ఎ) : ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రిజిస్ట్రార్ ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీ నుంచి హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా తొలగించడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈనెల 26 వరకు సెలవులు పొడిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, హాస్టళ్లు మూసివేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వొచ్చే నిరుపేద విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే కరెంటు, నీటి సరఫరా పునరుద్ధరించాలంటూ ఓయూ అధికారులను ఆదేశించింది.




