- బీజేపీ నియంత పాలన ప్రజాస్వామ్యంపై దాడి
- ఓటు చోరీకి నిరసనగా ఖమ్మంలో క్యాండిల్ ర్యాలీ
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 14: ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు, ప్రజలకు ఓటరు జాబితా సాఫ్ట్ కాపీ అందుబాటులో ఉంచాలని అడిగినందుకు ఆయనపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని, అందుకు నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా, ఉన్న ఓటర్లను లేనట్లుగా చూపిన ఓటరు లిస్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వాస్తవాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే ఓటు హక్కును కాపాడుకోవడమే.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూటమి ఏదో రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి నియంత పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీి పాలన తీరు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బిజెపికి లొంగిపోయి వాస్తవాలు బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు పుచ్చకాయల వీరభద్రం, బేబీ స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, ఆర్టిఏ సభ్యుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు కొవ్వొత్తులతో జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.
ఓటరు జాబితా అడిగితే రాహుల్‌పై కేసులా?




