సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ శరత్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ ఆర్ ఓలు, ఏ ఈ ఆర్ వో లతో ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలు, పరిష్కరణ, పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ, శుద్ధమైన ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ ఎస్ ఆర్ -2024 లో భాగంగా వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటర్ జాబితాలో నమోదు చేయించాలన్నారు. జనవరి 6,2024 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు అభ్యంతరాలను, క్లెయిమ్స్ ను స్వీకరించి, ఫిబ్రవరి రెండవ తేదీ లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించి, ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను వెలువ రించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, ఓటరు జాబితాలో ఇంకా డబుల్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలుంటే ఓటర్ జాబితా నుండి తొలగించాలన్నారు. వంద సంవత్సరాలు పైబడిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారించాలని తెలిపారు. 1500కు మించి ఓటర్లు ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించా లన్నారు. ఒక ఇంటిలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా జాబితాలో ఫోటోలు, ఇంటి నంబర్లు, పేర్లు, వయస్సు, పుట్టిన తేదీ వంటి ఏవైనా ఇంకా ఎక్కడైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సవరించుకుని శుద్ధమైన ఓటరు జాబితాను రూపొందించాలని తెలిపారు. పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని సూచించారు.జిల్లాలో అందుబాటులో గల ప్రభుత్వ భూముల వివరాలు అందించాలని
రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లాలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ, క్రిస్టియన్ లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ త్వరితగతిన చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా లో మహాలక్ష్మి, చేయూత (రాజీవ్ ఆరోగ్యశ్రీ) పథకాల అమలు తీరుపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, ఆర్టీసీ డిఎం లతో సమీక్షించాలని, అన్ని ఆసుపత్రులను సందర్శించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, డిఆర్ఓ నగేష్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఆయా తహసిల్దార్లు, ఎన్నికల విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాను రూపొందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్





