ఓఆర్‌ఆర్‌కు బయట…ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల… పారిశ్రామిక వాడలకు అనువైన భూముల గుర్తింపు

బంజరు భూములు, సాగుకు యోగ్యం కాని భూమల సేకరణ
కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత
గతంలో కేటాయించినా వినియోగించని భూములపై నివేదిక
పారిశ్రామికాబివృద్ధిపై డిప్యూటీ సిఎం భటితో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు బయట, రీజినల్‌ రింగ్‌ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ భూములు కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్‌ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు.  రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సోమవారం డా బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి  మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సిఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం రేవంత్‌ మాట్లాడుతూ…పరిశ్రమలకై సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకాని కానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతో పాటు కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని ఈ సందర్భంగా అధికారులను సిఎం ఆదేశించారు.

పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారని, ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు..వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి..అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సిఎం అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్‌ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్‌ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలోని తొమ్మిది పాత ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు.  దీనివల్ల, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని సిఎం అన్నారు.

పరిశ్రమలకు ధర్మల్‌ విద్యుత్‌ వినియోగం కాకుండా సోలార్‌ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాలను మోడల్‌ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలానగర్‌ లోని ఐడీపీఎల్‌ భూముల పరిస్థితిపై సిఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కృష్ణ భాస్కర్‌,  సిఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్‌ రెడ్డి, షా-నవాజ్‌ కాసీమ్‌ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *