తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల జీవితాలు గాలిలో దీపాలు అయినాయి.తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే బతుకులు బాగుపడతాయి ఉద్దేశంతో 2001 నుండి 2014 వరకు జరిగిన మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విశ్వవి ద్యాలయాల విద్యార్థులు, ఉద్యోగస్తులు చేసిన పోరాట పటిమ మరువలేనిది. రాష్ట్రం సాధించుకున్నాక ఉద్యమ కేంద్రాలైన విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురి కావడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఊరూరా తిరుగుతూ తెలం గాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులు చేయడంలో విశ్వవిద్యాలయ ఒప్పంద అధ్యాపకులు మొదటి వరుసలో ఉన్నారు. రైల్ రోకో, రాస్తారోకో, వంట వార్పు, సకల జనుల సమ్మె వంటి ఉద్యమాలను తమ భుజాన వేసుకొని జైలు జీవితం కూడా గడిపినారు.
రాష్ట్రం సాధిస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన వారందరికీ నేడు ఎదురు చూపే ఆఖరి చూపు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ విద్యాలయ ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించడానికి అనేక ఆటంకాలను అధిగమించినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడం విచారించదగ్గ విషయం. గత 25 -30 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారడంతో ఒప్పంద అధ్యాపకులు, తమ అనుభవమును, అర్హతలను పరిశీలించి శాశ్వత ప్రాతిపదిక నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.గత 25రోజులుగా రాష్ట్రంలోని 12 విశ్వ విద్యాలయాలలో ఒప్పంద అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న 1445 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. గతంలో అనేకసార్లు శాసన మండలి, శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని చెప్పి సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరంలో 1059 లెటర్ ను తీసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా విశ్వవిద్యాలయాలలో చేయటం జరిగింది. కానీ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీలో స్వయంగా ముఖ్య మంత్రి ప్రకటించి ఇందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొం దించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం సాధన సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగస్తులు అందరిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని నాటి ఉద్యమ నేత నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ రాష్ట్రం సాధించి పది సంవత్సరాలు గడిచినప్పటికీ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేయకపోవడం శోచనీయమని పలువురు మేధావులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుటకు ఏప్రిల్ 30వ తేదీ సచి వాలయం ప్రారంభ సమావేశంలో మొదటి ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర విశ్వవిద్యాలయా లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల విషయం అందులో లేకపోవడం వర్సి టీలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బాధ కలిగించడం సహజం. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలలో 69 శాతం ఖాలీలు ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ మూడు కలిపి రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలలో 2880 పోస్టులకు కేవలం ఈరోజు 800 మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 69 శాతం పోస్టులు ఖాలీగా ఉన్నాయి, సుమారు 2080 పోస్టుల వరకు ఖాలీగా ఉంటే ఇప్పుడు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు మొత్తం కూడా కేవలం 1356 (పీవీ నరసింహారావు వెటర్నటీ యూనివర్సిటీలో 22 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు వీరిని కలుపుకొని) వీరందరినీ రెగ్యులరైజ్ చేసినా, ఇంకా చాలా ఖాలీలు మిగులుతాయి. వీటి ఖాలీలు లలో పార్ట్ టైం అధ్యాపకులు కూడా కొనసాగుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు ఖాలీగా ఉన్నాయి, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు అధ్యాపకులని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పింది కాబట్టి ఆ హామీని నెరవేరుస్తూ రాష్ట్రంలోని విశ్వవిద్యా లయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల అందర్నీ క్రమబద్ధీకరించాలని, అప్పుడే విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్య ప్రమాణాలు పెరుగుతా యని విద్యావేత్తలు భావిస్తున్నారు.
ఉన్నత విద్యకు నిధులు కేటాయింపు తగ్గించి, ఉప్మా25 శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచడం, దానికి అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచకపోవడం విచారకరం. దీంతో ఆర్థిక భారాన్ని మోయలేక, సౌకర్యాల లేమితో యూనివర్సిటీలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 8 శాతం నిధుల కోతను విధించడంతో గోరుచుట్టుపై రోకలి పోటులా యూనివర్సిటీ విద్య, పరిశోధనలు, మౌళిక వసతులు కొరవడి వెలవెలబోతూ, యువతను ఉన్నత విద్యతో ప్రయోజకులను చేయడంలో విఫలం అవుతున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో లైబ్రరీ నిధుల కోతలతో జర్నల్స్/పుస్తకాల కొరత, జీతభత్యాల చెల్లింపులో జాప్యం, సౌకర్యాల కొరత, తరగతి గదుల్లో అతిగా విద్యార్థుల సంఖ్య, వసతులులేని హాస్టల్స్, పారిశుధ్యలేమి లాంటి అనేక సమస్యలు చుట్టు ముట్టి విద్యాబోధన, పరిశోధనలు అంతరించే స్థాయికి చేరడం రాష్ట్ర ప్రగతికే గొడ్డలి పెట్టు కానున్నాయి.రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో 2.7 శాతం మాత్రమే పిహెచ్‌డి ప్రోగ్రా మ్‌లను నిర్వహిస్తున్నాయి.
తిన్న అయిపోయింది విద్యా ర్థులు – అధ్యాపకుల నిష్పత్తిలో వ్యత్యాసాలు, పరిశోధనా నిధుల కోతలు, పీహెచ్‌డి ప్రోగ్రామ్స్ లేకపో వడం, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తరగడం, కనీస అవసరాలకు నిధులు కాకపోవడం లాంటి అనేక తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకున్న విశ్వవిద్యాలయాలు యువభారతానికి ఆశించిన స్థాయిలో ఉన్నత విద్యను అందించడంలో విఫలం అవుతు న్నాయి. విశ్వవిద్యాలయాల్లో తగ్గిన విద్యా ప్రమా ణాలు, ప్రయోగశాల సౌకర్యాల లేమి, అధ్యాపకుల కొరత లాంటి పలు సమస్యలకు సమీప భవిష్యత్తులో సమాధానం దొరికే దారులు కనిపించడం లేవు. విశ్వవిద్యాలయ ఉమ్మడి నియామకాలకు సంబంధించిన ఫైలు గవర్నర్ టేబుల్ మీది నుంచి రాష్ట్రపతి భవనంకు చేరి కొన్ని నెలలు గడుస్తున్న ప్రగతి కనిపించడం లేదు.విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడడం, అవసర నిధులను కేటాయించడం, విద్యను పరిశోధనలకు ముడిపెట్టడం, విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిని కాపాడటం, పాలనా సంస్కరణలు తేవడం, క్యాంపస్‌లో విద్య వాతావరణాన్ని నెలకొల్పడం, అధ్యాపకుల నియమకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, ఆధునిక డిజిటల్ యుగ మేధో వికాసం ఫలించడం, నైపుణ్య యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే ఉన్నత విద్య లక్ష్యం. అలాంటి యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం సమాజానికి హానికరం.
యువత నిర్వీ ర్యమైతే దేశ పురోగమృద్ధి కుంటుపడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం,కాకతీయ యూనివర్సిటీలో జరిగిన మాజీ ఉపకులపతుల సదస్సు, జేఎన్టీయూహెచ్ హైదరాబాదులో జరిగిన సదస్సులలో అనేకమంది మేధావులు, పూర్వపు ఉపకులపతులు, ప్రస్తుత పరిస్థితులలో ఒప్పంద అధ్యాపకులను శాశ్వత అధ్యా పకులుగా పదోన్నతి కల్పించి, వారిని పరిశోధనల దిశగా ప్రేరేపిస్తేనే విశ్వవిద్యాలయాలకు మనుగడ ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మేధావుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని, ఉన్నత విద్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను శాశ్వత అధ్యాపకులుగా కొనసాగించడానికి చర్యలు చేపట్టాలని పలువురు భావిస్తున్నారు.
– వేదాంతం హరి కుమార్
హనుమకొం• •9951191819




