ఒకడు రోడ్డుపై కొన్ని రాళ్ళు పాతాడు
ఒకామె వంటింట్లో కొన్ని మొక్కలు నాటింది
ఇద్దరూ మేలు చేసామే అనుకుంటున్నారు
వచ్చే జనం పోయే జనంతో
వీళ్ళ నిర్వాకాన్ని చెబుతున్నారు
వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా
అటువంటి వాళ్ళు లేకపోలేదు
పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ పనులు చేస్తూ
ప్రైవేట్ ప్లేస్ ను పబ్లిక్ గా మారుస్తూ…
ఒక పిచ్చివాడు కొన్ని మనుషుల
మనస్తత్వాలను ప్రదర్శిస్తూ పోతున్నాడు
అందరిలోనూ అతనున్నాడు
లోపల స్థిమితం కోల్పోయి
బయటికి వీడేమో కనిపిస్తాడు
వికారం గొల్పుతూ…
ఒక బిచ్చగత్తె మాత్రం ఇవేవి పట్టించుకోక
బతుకు సిగ్నల్ దగ్గర పరుగుపరుగునా
చెయ్యి చాపుతూ పోతుంది
మనుషులు మాత్రం కొన్ని దృశ్యాలను
వాళ్ళ ఉపచేతనలో నింపుకుంటూ పోతున్నారు
అవెప్పుడో కలల రూపంలో భయపెడతాయి
రాళ్ళ మొక్కలై మొక్కల రాళ్ళై అన్నీ
ఒక రెడ్ సిగ్నల్ లోకి చొచ్చుకుపోతున్నట్టు
వంటింట్లోకి రోడ్డు జొరబడినట్టు
ఆ రొడ్డేమో వంకరపోయి
అక్కడితో అయిపోయి
అవతల ఖాళీలోకి
అగాధంలోకి పడుతున్నట్టు
వెనక్కి లాగుతున్నట్టు ఎవరో
వెంటాడి తరుముతున్నట్టు మరెవరో
పిచ్చివాడి తల బిచ్చగత్తె ఒడిలో ఉన్నట్టు
ఇవన్నీ చూస్తూపోతూ
ఎదో తట్టుకుని బోర్లా పడ్డట్టు…
పళ్ళు జివ్వుమని లెగిస్తే-
ఆ మొక్కలు కిటికీ బయట చెట్లై
రాళ్ళేమో డివైడర్లై దర్శనమిస్తూ
ఒక ‘అధివాస్తవిక చిత్రం’
అర్బనైజేషన్ కుహరంలో..!!
– రఘు వగ్గు




